epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

ప్రతిపక్షాలకూ పద్మాలు.. గౌరవార్థమా? వ్యూహాత్మకమా?

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో మోదీ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి పద్మ అవార్డుల్లో (Padma Awards) ఎలాంటి వివక్ష లేదని.. సమాజ సేవలో ఉన్న వివిధ రంగాల వారికీ ప్రయారిటీ ఇస్తున్నదని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రత్యర్థులైనప్పటికీ ప్రతిపక్ష నేతలను కూడా పురస్కారాలతో గౌరవించిందని లెక్కలు చూపెడ్తున్నారు. అవార్డుల ఎంపికలో ప్రతిపక్షాలు అనే మాట కన్నా.. వారి సేవలనే మోదీ సర్కార్ గుర్తించిందని అంటున్నారు. అయితే.. ఎన్నికలు, ఓట్లే లక్ష్యంగా అవార్డులు కనిపిస్తున్నాయని అపొజిషన్ నేతలు విమర్శిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటాయో.. ఆ రాష్ట్రాలకు అవార్డుల కేటాయింపులో టాప్ ప్రయారిటీ ఉంటుందని, అక్కడ ప్రతిపక్షాలను కూడా పద్మాలతో సత్కరించి ఓట్లు కొల్లగొట్టాలనేదే బీజేపీ వ్యూహమని దుయ్యబడుతున్నారు.

2026 పద్మ అవార్డుల్లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ కు ప్రయారిటీ దక్కడమే ఇందుకు ఉదాహరణ అని.. ఆయా రాష్ట్రాల్లో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్తున్నారు. కేరళలో కమ్యూనిస్ట్ నేత, మాజీ సీఎం అచ్యుతానందన్ కు (మరణానంతరం) పద్మవిభూషణ్ ను తాజాగా ప్రకటించడం వెనుక ఇదే వ్యూహం ఉందని.. అవార్డు ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చి ఉండొచ్చు కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తోఖేహో సెమా టు అచ్చుతానందన్

మోదీ ప్రభుత్వం ప్రకటిస్తున్న పద్మ అవార్డుల్లో (Padma Awards) అప్పుడప్పుడు ప్రతిపక్ష నేతలు హైలెట్ అవుతున్నారు. ఒక్కోసారి వారి సంఖ్య ఎక్కువగా కూడా ఉంటున్నది. 2015లో నాగాలాండ్ కాంగ్రెస్ నేత తోఖేహో సెమాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 2017లో మహారాష్ట్ర కీలక నేత, నేషనల్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ కు, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాకు పద్మభూషణ్ అవార్డులను ఇచ్చింది. 2020లో పీడీపీ లీడర్ ముజఫర్ హుస్సేన్ బేగ్, కాంగ్రెస్ నేత, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్ సీ జమేర్ కు పద్మభూషణ్ ను అనౌన్స్ చేసింది. 2021లో కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్, మాజీ ఎంపీ తర్లోచన్ సింగ్ కు పద్మభూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024లో తర్లోచన్ సింగ్ బీజేపీలో చేరారు. 2022లో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ ను అనౌన్స్ చేసింది.

అయితే.. తనకు అవార్డు ప్రకటిస్తున్నట్లుగా ముందుస్తు సమాచారం ఏమీ ఇవ్వలేదని, దాన్ని తాను తీసుకోబోనని అప్పట్లో భట్టాచార్య తేల్చిచెప్పారు. 2022లోనే కాంగ్రెస్ సీనియర్ నేత (ప్రస్తుతం మాజీ) గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్ యాదవ్ కు మరణానంతరం 2023లో పద్మవిభూషణ్ ను అనౌన్స్ చేసింది. ఇప్పుడు బెంగాల్ కమ్యూనిస్ట్ నేత అచ్చుతానందన్ కు పద్మవిభూషణ్ (మరణానంతరం), జార్ఖండ్ నాయకుడు శిబు సోరెన్ కు పద్మ భూషణ్ (మరణానంతరం)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

శరద్ పవార్, పీఏ సంగ్మా, తరుణ్ గొగోయ్, గులాం నబీ ఆజాద్ వంటి వారికి అవార్డులు దక్కినప్పుడు వారి రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని కేంద్రంలోని బీజేపీ సర్కార్ వాటిని ప్రకటించిందన్న విమర్శలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో బలాన్ని చాటుకునేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇలా వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపించాయి. 2022లో ములాయంసింగ్ యాదవ్ కు (మరణానంతరం) పద్మవిభూషణ్ ను ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఓట్ల కోసమే ఇలా అవార్డును ముందుకు తెచ్చారన్న విమర్శలు వచ్చాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనకు పద్మభూషణ్ ఎలా ప్రకటిస్తారంటూ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తిరస్కరించడం అప్పట్లో చర్చకు దారితీసింది. పారదర్శకత, నిష్పక్షపాత వైఖరిని అవార్డుల ప్రకటనలో చూపిస్తున్నట్లు కేంద్రం చెప్తున్నా.. అదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనని విమర్శలు వస్తున్నాయి.

Read Also: భారత్​ – ఈయూ ‘మదర్​ ఆఫ్​ ఆల్​ డీల్స్​’ వీటి పైనే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>