వివాదాలకు కేరాఫ్ పైలట్ రోహిత్.. అప్పుడలా, ఇప్పుడిలా..!

కలం, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ సర్కార్ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా నిలిచిన తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) తాజాగా డ్రగ్స్ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్ డిబేట్‌కు దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ (Moinabad Farmhouse)పై సోదాలు నిర్వహించారు.. బీజేపీ తరఫున బేరసారాలకు వచ్చారనే ఆరోపణలతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు అదే ఫామ్ హౌజ్‌లో రోహిత్‌రెడ్డి డ్రగ్స్ తో దొరికిపోయారు. నార్కొటిక్ విభాగం నిర్వహించిన టెస్టులో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. డ్రగ్ సేవించినట్లు కన్‌ఫమ్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇదే ఫామ్ హౌజ్ కేంద్రంగా పోలీసులకు సహకరించిన రోహిత్‌రెడ్డి ఇప్పుడు దోషిగా నిలబడే పొజిషన్‌లో ఇరుక్కున్నారు.

బెంగళూరు డ్రగ్ కేసులోనూ ఆయన పేరు :

పైలట్ రోహిత్ రెడ్డి గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానే ఉన్నారు. 2021లో బెంగళూరులో నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేయగా అతని లిస్టులో రోహిత్ రెడ్డి పేరు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే విషయంపై రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను హడావుడిగా కేసీఆర్ రికార్డు చేయించారని, బండి సంజయ్ వంటి బీజేపీ అగ్ర నాయకులు బహిరంగంగానే ఆరోపించారు. రోహిత్ రెడ్డి కడిగిన ఆణిముత్యం అని.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడం వల్లే రోహిత్ రెడ్డిపై కేంద్రం కక్షసాధింపు చర్యలు చేస్తోందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీంతో కర్ణాటక డ్రగ్ అంశం అటకెక్కింది. అయితే తాజాగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో ఆయన వ్యసనపరుడునే అంశం నిర్ధారణ అయింది.

దేశవ్యాప్తంగా హాట్ టాపిక్…

ఒకప్పుడు రాజకీయ కుట్రలకు కేంద్రంగా ప్రచారంలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ కల్చర్‌కు చిరునామాగా మారింది. గతంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వస్తే.. ఇప్పుడు ప్రముఖ రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల సమక్షంలో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహిస్తున్నారని తేలింది. ఇందులో ఏపీలోని సిట్టింగ్ ఎంపీకి కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడం గమనార్హం. డ్రగ్స్ వినియోగం, రాజకీయ నాయకులు పాల్గొనడం వంటి అంశాలు బయటకు రావడంతో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డ్రగ్స్ వ్యసనానికి బానిసైన నాయకులు రాజకీయాల్లో అనర్హులని.. అలాంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోవద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పకడ్బందీగా కెమెరాలను అమర్చి పోలీసులకు సహకరించిన పైలట్ రోహిత్‌రెడ్డి ఇప్పుడు ఆయనకే తెలియని తీరులో పోలీసులు అకస్మాత్తుగా చేసిన రెయిడ్‌లో దొరికిపోవడం కొసమెరుపు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>