epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

భారత్​ – ఈయూ ‘మదర్​ ఆఫ్​ ఆల్​ డీల్స్​’ వీటి పైనే?

కలం, వెబ్​డెస్క్​: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘మదర్​ ఆఫ్​ ఆల్​ డీల్స్​’ (Mother Of All Deals) కు సమయం ఆసన్నమైంది. ఈ నెల 27న ఢిల్లీ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్​ యూనియన్​ (ఈయూ) ప్రెసిడెంట్​ ఉర్సులా వాన్​డర్​ లేయెన్​ తమ తమ ప్రతినిధులతో కలసి ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ కుదుర్చుకోనున్నారు.

ఇప్పటికే రెండు వైపులా అధికారులు ప్రతిపాదనలు, పత్రాలతో సిద్ధమయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటికే అనేక సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదిరింది. రాజకీయంగా సున్నితమైన కొన్నిటిపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా రెండు పక్షాలకు అనుకూలంగా ముగిస్తే.. కొన్ని దశాబ్దాల తర్వాత భారత్ చేపట్టిన అతిపెద్ద మార్కెట్ ఓపెనింగ్‌గా నిలవనుంది. ఈ క్రమంలో భారత్, ఈయూ మధ్య ఏయే అంశాల్లో ఒప్పందం కుదిరే అవకాశముందని విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు భావిస్తున్నారంటే..

యూరోపియన్ కార్లపై సుంకాల్లో కోత..

ఖరీదైన కార్ల తయారీకి యూరప్​ ప్రసిద్ది. బెంజ్​, బీఎండబ్ల్యూ, ఆడి, వోక్స్​వాగన్​, పోర్షే, ఫెరారి, లాంబోగిని, ఫియట్​, రెనాల్ట్​, వోల్వో, సియట్​, స్కోడా వంటి లగ్జరీ బ్రాండ్లకు ఈయూనే కేంద్రం. వీటిపై భారత్​లో 110శాతం దిగుమతి సుంకం ఉంది. ఫలితంగా ఈ కార్లు భారత మార్కెట్​లో పరిమిత సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై సుంకాలను తగ్గించే ప్యాకేజీని ఇప్పటికే భారత్​ ప్రతిపాదించింది. దిగుమతి సుంకాన్ని ఏకంగా 40శాతానికి తగ్గించేందుకు భారత్​ సిద్ధమైంది. ఇది ఒప్పందంలో కీలకంగా భావిస్తున్నారు. ఇది అటు ఈయూలో ఆటోమొబైల్​ తయారీదారులకు, ఇటు భారత్​లో ఆటో మార్కెట్‌కు ఊతంగా ఉంటుందని ఆశిస్తున్నారు.

ప్రాధాన్య రంగాలు ఇవే..

యూరోప్ మార్కెట్‌లో టెక్స్​​టైల్స్​, వస్త్రాలు, రత్నాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి రంగాలకు మెరుగైన అవకాశం కావాలని భారత్ కోరుతోంది. ఇటీవల ఈయూ నిబంధనల మార్పులతో ఈ రంగాలు సుంకాల ప్రయోజనాలు కోల్పోయాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్న వినియోగ మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు ప్రయోజనం కలగనుంది.

అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్​ అయిన భారత్​ను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఈయూ భావిస్తోంది. ఇందులో అనేక వ్యూహాత్మక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, రాజకీయాలు అనిశ్చితంగా మారుతున్న వేళ.. సప్లయ్​ చైన్​, దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం భారత్ కీలకంగా మారింది. విస్తృత మార్కెట్‌, స్థిరత్వం, వేగవంతమైన వృద్ధి భారత్‌ను ఈయూకు ఆకర్షణీయ భాగస్వామిగా నిలబెడుతున్నాయి.

ఈసారి రాజీ ధోరణిలో..

భారత్–ఈయూ ఎఫ్‌టీఏ చర్చలు దశాబ్దాలు కొన్ని అంశాల వద్ద అలాగే నిలిచిపోయాయి. ముఖ్యంగా కార్లు, మద్యం, కొన్ని నియంత్రిత సేవల రంగాల్లో తమకు భారత్ మార్కెట్‌ను తెరవాలని ఈయూ కోరిక. అదే సమయంలో భారత్ మాత్రం స్కిల్డ్​ లేబర్​కు మొబిలిటీ, శ్రమాధారిత ఎగుమతులకు మెరుగైన సౌకర్యాలు కావాలి ఆశించింది. వీటిలో సరైన పురోగతి లేకపోవడంతో దశాబ్దాలుగా భారత్​, ఈయూ చర్చలు ముందుకు కదల్లేదు. ఈసారి మాత్రం ఇరు పక్షాలు రాజీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని వర్గాలు చెబుతున్నాయి.

అందుకే ఈ ఎఫ్‌టీఏ కీలకం..

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్​టీఏ) కేవలం సుంకాల ఒప్పందం కాదు. భారత్‌ వాణిజ్య విధానంలో మార్పుకు సంకేతం. దేశీయ పరిశ్రమల రక్షణకే పరిమితం కాకుండా, టార్గెట్​ మార్కెట్ ఓపెనింగ్ ద్వారా పెట్టుబడులు, ఎగుమతులు, గ్లోబల్​ స్థాయిలో భారత్ స్థానం మరింత బలపడుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. అందువల్లే భారత్–ఈయూ బలమైన ఆర్థిక భాగస్వామ్యం కొత్త గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మదర్​ ఆఫ్​ ఆల్​ డీల్స్​ (Mother Of All Deals)గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>