కలం, తెలంగాణ బ్యూరో : అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు (Municipal Elections Schedule) మంగళవారం వెలువడనున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఇంకా వెల్లడించకపోయినప్పటికీ దానికి అవసరమైన కసరత్తు మాత్రం మొదలుపెట్టింది. అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సాయంత్రానికి షెడ్యూలును ప్రకటించే అవకాశమున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేలోగా పూర్తి చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నది. శివరాత్రి పండుగ ఫిబ్రవరి 15న, ఆ తర్వాతి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు మొదలవుతుండడంతో ఆ లోపే పోలింగ్ కంప్లీట్ అయ్యే అవకాశమున్నది.
ప్రచారానికి పదిహేను రోజులు :
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ (Municipal Elections Schedule) జనవరి 27న విడుదలైతే వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగేలా రిజర్వేషన్ ఫార్ములాను ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రాథమిక సమాచారం. దీంతో ఫిబ్రవరి 12 సాయంత్రం ప్రచారం ముగిసిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిరసన కార్యక్రమాల్లో భాగంగానే నిర్వహించనున్నారు. షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు మొత్తం 15 రోజుల పాటు ప్రచారం చేసుకునే వీలు ఉంటుంది. పార్టీ ఎన్నికల గుర్తులపై జరిగే పోలింగ్ కావడంతో వివిధ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా పోలీసు శాఖను స్టేట్ ఎలక్షన్ కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నది.
Read Also: అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్.. ఎట్ హోంకు డుమ్మా
Follow Us On: Pinterest


