కలం, తెలంగాణ బ్యూరో : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) విజయం కోసం అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ముమ్మరంగా పోటీ పడుతున్నాయి. కనీసం వంద స్థానాలు గెలిచి సెంచరీ మార్క్ సాధించాలని కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకున్నది. బీఆర్ఎస్ మాత్రం 35 స్థానాలు తమవేనని ధీమాతో ఉన్నది. బీజేపీ సైతం అర్బన్ ఓట్ బ్యాంకును మోడీ ఇమేజ్‌తో కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నది. అన్ని పార్టీలూ ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించాయి. ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్. జిల్లాల్లో పార్టీ సంస్థాగత సమావేశాలు పెట్టి శ్రేణుల్లో జోష్ పెంచుతున్నది బీఆర్ఎస్. సికింద్రాబాద్ మినహా ఏడుగురు ఎంపీలు ఉండడంతో అక్కడి మున్సిపల్ బాడీల్లో విజయం కోసం బీజేపీ కసరత్తు చేస్తున్నది.
ఐదు సంస్థలతో ముమ్మర సర్వే :
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల కారణంగా దాదాపు 700 చోట్ల ఇబ్బందులు తలెత్తాయని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలని అటు పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలుగా నియమించిన మంత్రులకు స్పష్టం చేశారు. క్యాబినెట్ సమావేశం తర్వాత అదే వేదికగా వారితో విడిగా మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. గాంధీభవన్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో సైతం మున్సిపల్ ఎన్నికలపై (Municipal Elections) పార్టీ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే ప్రతి మూడు పార్లమెంటు సెగ్మెంట్లకు ఒకటి చొప్పున మొత్తం ఐదు సంస్థలు కాంగ్రెస్ తరఫున సర్వే చేస్తున్నాయి. నేడో రేపో నివేదిక పీసీసీకి అందనున్నది.
సీఎం ప్రచారంపై కాంగ్రెస్ ధీమా :
పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో హస్తం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒవరాల్‌గా 90% స్థానాలను ఖాతాలో వేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నా కనీస స్థాయిలో వంద సీట్లు గెలవాలనుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో స్వయంగా పాల్గొంటానంటూ సీఎం ఇప్పటికే ప్రకటించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రలకు నిరసనగా జరిగే పార్టీ బహిరంగ సభలను మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలుగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. వచ్చే నెల 3-9 తేదీల మధ్య ప్రతీ ఉమ్మడి జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. సీఎం రేవంత్ అమెరికా నుంచి ఫిబ్రవరి 1 రాత్రికి రాగానే ప్రచార సభలు షురూ కానున్నాయి.
సర్వేలో స్టడీ చేయనున్న అంశాలేంటి? :
పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల అంచనా తప్పడంతో మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని అధిగమించాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. అందులో భాగమే క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతను ప్రైవేటు సర్వే సంస్థలకు అప్పజెప్పింది. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నది?.. ఇతర పార్టీల నుంచి చేరికలు ఎక్కడ అవసరం?.. గెలవగలిగే అభ్యర్థులు ఎవరు?… ఎక్కడెక్కడ పార్టీ నేతల మధ్య అంతరం ఉన్నది?.. ఇది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?.. ఆ గ్యాప్‌ను అధిగమించడానికి ఏం చేయాలి?.. మంత్రులు, డీసీసీల మధ్య సమన్వయ లోపమున్నదా?.. ఇలాంటి అంశాలతో సర్వే జరుగుతున్నది. దాదాపు ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో పీసీసీ చేతికి నివేదికలు అందున్నాయి. దాన్ని స్టడీ చేసిన తర్వాత సీఎంతో చర్చించి తదుపరి యాక్షన్ ప్లాన్‌పై నిర్ణయం జరగనున్నది. ఎన్నికల ఎజెండా, ప్రచార సరళిత తదితరాలపైనా స్పష్టత రానున్నది. ఈ రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఖరారు కానున్నది. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని పీసీసీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు.
Read Also: 30% సూసైడ్స్.. IIT కాన్పూర్ లో ఏం జరుగుతోంది?
Follow Us On : WhatsApp


