epaper
Monday, November 17, 2025
epaper
HomeAbout us

About us

ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశంలో ఫోర్త్ పిల్లర్‌గా మీడియాది కీలక పాత్ర. పరిపాలన సక్రమంగా లేనప్పుడు వేలెత్తి చూపాలి. ప్రజల పక్షాన నిలబడుతూ పాలకుల వైఫల్యాన్ని బహిర్గతం చేయాలి. ప్రజల ఓటు ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల తప్పొప్పులను సమాజానికి చూపించాలి. ‘మీడియా అంటే ప్రజలకు ఒక భరోసా’ అనే అభిప్రాయం ఏర్పడాలి. మిగిలిన మూడు పిల్లర్లు ప్రజల కోసం పనిచేయనప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్ళాలి.

అలాంటి మీడియా తన సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలేదని సమాజంలో ఒక సాధారణ అభిప్రాయం ఏర్పడింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఇప్పుడు ప్రాంతాలవారీగా, పార్టీలవారీగా విభజనకు గురయ్యాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా అవి ప్రచురించే వార్తల్లోని వాస్తవాలను తెలుసుకోడానికి పలు పత్రికలు, టీవీ ఛానెళ్ళపై ఆధారపడాల్సి వస్తున్నది. నిష్పాక్షికంగా వార్తలను, కథనాలను ప్రచురించి, ప్రసారం చేసే పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఇప్పుడు కరువయ్యాయనే ఒక సాధారణ అభిప్రాయమూ ప్రజల్లో నెలకొన్నది.

దురదృష్టవశాత్తూ ఆయా సంస్థల్లో పనిచేసే పాత్రికేయులు సైతం యాజమాన్య పాలసీలకు అనుగుణంగా పనిచేయక తప్పడంలేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా సంస్థ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలను, కథనాలను వండి వార్చక తప్పడంలేదు.

దీనికి తోడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలక పక్షాల ధోరణిలో మార్పు వచ్చింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రసార మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకున్న పార్టీల నేతలే ఆ తర్వాత అధికారంలోకి వచ్చి కంటికి కనిపించని, మనసు గ్రహించని తీరులో ఆంక్షలు విధించారు. ప్రతీ మంత్రిత్వశాఖ, డిపార్టుమెంటులో పీఆర్వో వ్యవస్థను సృష్టించి అది ఇచ్చిన వార్తలే ప్రామాణికం, పరమావధి అనే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించింది. పాత్రికేయులు స్వయంగా వాస్తవాలను, గణాంకాలను తెలుసుకునే మార్గాలను, అవకాశాలను మూసివేసింది.

నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశం వివరాలేవో, అందులోని వాస్తవాలేవో పాత్రికేయులకు తెలియనివ్వడంలేదు. పీఆర్వో వ్యవస్థ ఇచ్చిందే వార్త.. అదే వాస్తవం.. వాటినే ప్రచురించాలి.. వాటినే ప్రసారం చేయాలి.. ఇలాంటి నిర్బంధ పరిస్థితులతో మీడియాకు పరిమితులు ఏర్పడ్డాయి. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతున్నది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వర్గాలూ అనుకూలంగా ఉండే మీడియాకు (అనుకూలంగా ఉండేలా మార్చుకున్నాయి) పాజిటివ్ వార్తలను, వివరాలను, గణాంకాలను చేరవేస్తూ కథనాలు రాసేలా ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టబోయే కొత్త పథకాలను, పాలసీలను, పరిణామాలను ముందుగానే అనుకూల మీడియాకు చేరవేసే అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తున్నాయి.

టెక్నాలజీలో వచ్చిన మార్పుల్లో భాగంగా సోషల్ మీడియా విస్తృతి పెరింది. వ్యక్తగత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామిక వేదికలుగా మారాయి. కానీ వీటిలో వాస్తవాలేవో, స్వంత వ్యాఖ్యానాలేవో ప్రజలు ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. ఫలితంగా అయోమయం నెలకొన్నది. అందుకే సోషల్ మీడియాలో కనిపించే సమాచారాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసించడంలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో నిష్పాక్షికంగా, నిజాయితీగా, నిబద్ధతో వార్తలను, కథనాలను ఇవ్వాలన్న లక్ష్యంతో ‘కలం డైలీ డాట్ కామ్’ ఒక డిజిటల్ మీడియాగా మీ ముందుకు వస్తున్నది. ప్రధాన స్రవంతిగా పిల్చుకునే ప్రింట్ మీడియా (దినపత్రికలు)కు, టీవీ ఛానెళ్ళకు ఎంత బాధ్యత ఉన్నదో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ రూపంలో వస్తున్న మీడియాకూ అంతే బాధ్యత ఉన్నది. సోషల్, డిజిటల్ మీడియాను ఒకే గాటన కట్టే పరిస్థితులున్నా నిజానికి వీటి మధ్య స్పష్టమైన విభజన రేఖే ఉన్నది.

డిజిటల్ మీడియాగా ‘కలం’ నుంచి జాలువారే ప్రతీ అక్షరం ప్రజల మెదళ్ళను కదిలించాలనేది మా లక్ష్యం. ‘కలం’ యావత్తు ప్రజల గళం. వారికి బలమైన శక్తి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి దారితీసిన కారణాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారానికి పూనుకోవాల్సిన అవసరం, సమస్యల తీవ్రత తదితరాలను ‘కలం డైలీ డాట్ కామ్’ అందిస్తుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నిజమైన వారధిగా ఉంటూ వారి గళాన్నిప్రభుత్వానికి వినిపిస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం లభించేలా చొరవ తీసుకుంటుంది. వార్తలు, వ్యాఖ్యానాలు, అందులోని వాస్తవాన్ని పాలు-నీళ్ళు తరహాలో ‘కలం’ బహిర్గతం చేస్తుంది.

ప్రజల అవసరాలు తీరడం, సమస్యలకు పరిష్కారం దొరకడమే సమాజ పురోగతికి ఒక నిదర్శనం. ప్రజల గొంతును వినిపించడం, ప్రభుత్వాన్ని కదిలించడం ‘కలం డైలీ డాట్ కామ్’ లక్ష్యం. అధికార, విపక్షాలేవైనా, వాటి తరఫున వకాల్తా పుచ్చుకునే నేతలు ఎవరైనా తప్పు చేస్తే నిర్భయంగా, నిజాయితీతో ప్రశ్నిస్తుంది. ఏ పక్షానికీ కొమ్ముకాయకుండా పనిచేసే ‘కలం’ నిత్యం ప్రజల పక్షం.