కలం, వెబ్‌డెస్క్: గ్రీన్లాండ్ (Greenland) స్వాధీనంలో తగ్గేదేల్యా అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన లక్ష్యానికి అడ్డుపడుతున్న నాటో దేశాలను వెక్కిరిస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ట్రంప్‌తో (Donald Trump) ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్స్ తదితర నాటో దేశాల ప్రతినిధులు భేటీ అయినట్లు ఉండగా, వారు కూర్చొని ఉన్న హాల్లో అమెరికాతో డెన్మార్క్ కలసిపోయి ఉన్న మ్యాప్ ఉంది. అంతేకాదు, ఇందులో కెనడా, మెక్సికో, వెనెజువెలాను సైతం అమెరికా జాతీయ జెండాలోని రంగులతో నింపడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే గ్రీన్లాండ్తోపాటు కెనడా, మెక్సికో, వెనెజువెలాపైనా (Venezuela) ట్రంప్ కన్ను వేసినట్లు అర్థమవుతోంది.
కాగా, అంతకుముందు గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో తనను ఎవరూ వెనక్కి తగ్గేలా చేయరని అర్థం వచ్చేలా మరో పోస్ట్‌ను సైతం ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. మేక్రాన్, కీర్ స్టార్మర్ చూస్తుండగా అమెరికా జెండాను గ్రీన్లాండ్లో ట్రంప్ పాతుతున్నట్లు ఈ ఫొటోలో ఉంది. అందులోనే 2026 నుంచి గ్రీన్లాండ్ అమెరికాకు చెందినది అనే వాక్యాలు ఇంగ్లీష్‌లో రాసి ఉన్న బోర్డు కూడా ఉంది. ఈ రెండు చిత్రాలతో తన నాటోతోపాటు ప్రపంచ దేశాలకు మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. అంతకుముందు, బుధవారం ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ట్రంప్ ఇదే విషయం గురించి మాట్లాడారు. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ కచ్చితంగా తమ సొంతం కావాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.
చాగోస్లా గ్రీన్‌లాండ్‌ను వదులుకోం..
కాగా, చాగోస్ దీవుల విషయంలో యూకే చేసిన తప్పును తాము చేయబోమని ట్రూత్‌లో ట్రంప్ మరో పోస్ట్ చేశారు. ‘నాటో మిత్రదేశమైన యూకే.. చాగోస్ దీవులను మారిషస్‌కు ఇస్తోంది. ఇది తెలివితక్కువ పని. ఎందుకంటే చాగోస్ దీవుల్లోని డీగో గార్సియాలో మా(అమెరికా) సైనిక స్థావరం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితి గ్రీన్లాండ్ (Greenland) విషయంలో ఎదురుకాకూడదని మా ప్రయత్నం’ అని ట్రంప్ అన్నారు. కాగా, హిందూ మహాసముద్రంలోని చాగోస్ 60 దీవుల సముదాయం. ఇవి ఒకప్పుడు మారిషస్ దీవుల్లో భాగంగా ఉండేవి. 1965లో చాగోస్‌ను యూకే కొనుగోలు చేసింది.
అయితే, ఈ దీవులను వేరే దేశాలకు యూకే ఇస్తోందంటూ మారిషస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. ఈ గొడవకు పుల్‌స్టాప్ పెడుతూ ఇటీవలే ఈ రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. చాగోస్‌ను మారిషస్‌కు ఇచ్చేలా, బదులుగా అందులోని డీగో గార్సియాను 99 ఏళ్లకు యూకే లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. దీనిపై అప్పట్లో సంతోషం వ్యక్తం చేసిన ట్రంప్, ప్రస్తుతం మాట మార్చారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో రష్యా, చైనాను సాకుగా చూపుతూ వస్తున్న ట్రంప్.. ఇప్పుడు చాగోస్ దీవులను కూడా ఒక కారణంగా పేర్కొన్నారు.
Read Also: తెలంగాణతో గూగుల్ భాగస్వామ్యం
Follow Us On: Sharechat


