కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. ‘ఈగల్’ (Eagle) టీమ్ పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో హైదరాబాద్ (Hyderabad) శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్‌లో సోదాలు జరిగాయి. లోతుగా తనిఖీలు చేసిన తర్వాత రెండు గ్రాముల కొకెయిన్ పట్టుబడింది. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సోదాలు చేసిన పోలీసులు తెలిపారు. తనిఖీలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. కానీ ఎవ్వరికి ఏ మేరకు గాయాలయ్యాయనేది ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, మరో ఆరుగురు వీఐపీలుగా చెప్పుకునేవారు హాజరైనట్లు ప్రాథమిక సమాచారం.
ఫామ్ హౌజ్ చుట్టూ పోలీసుల మోహరింపు
డ్రగ్స్ (Drugs) మత్తులో పోలీసులు సోదాలు చేయడాన్ని పసిగట్టలేకపోయిన ఒకరు రివాల్వర్‌తో కాల్పులకు తెగబడినట్లు తెలిసింది. ఈ శబ్దం సమీపంలోనివారికి ఆందోళనకు గురిచేసింది. ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే చేసిన టెస్టులో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌజ్ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. వివరాలు తీసుకున్న తర్వాత తదుపరి కార్యాచరణపై స్పష్టత వస్తుందన్నారు.

