కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావిడి నెలకొంది. షెడ్యూల్ రిలీజ్ కాకముందే ఏ వార్డులో ఎవరు పోటీ చేయాలి, ప్రత్యర్థుల్ని ఎలా చిత్తు చేయాలంటూ ఎవరికి వారు వ్యుహాలు రచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట (Suryapet) జిల్లాల సంగతి ఎలా ఉన్నా.. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో మాత్రం మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
యాదాద్రి జిల్లాలో ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య పోరు పోటాపోటీగా సాగింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ పంచాయతీ స్థానాలను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇంఛార్జులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ క్యాడర్‌కు పెద్దగా సపోర్టు చేయలేదు. అయినప్పటికీ ఊహించని స్థాయిలో గులాబీ క్యాడర్ పంచాయతీలను దక్కించుకుంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఇంఛార్జిలు, మాజీ ఎమ్మెల్యేల్లో కొత్త జోష్ కన్పించింది.
యాదాద్రి జిల్లాలోని (Yadadri Bhuvanagiri) బీఆర్ఎస్ సర్పంచ్‌లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో పంచాయతీలను దక్కించుకోవడంలో విఫలమయ్యింది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనైనా (Municipal Elections) కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందా లేదా చతికిల పడుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
Read Also: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు యూనిలీవర్ పరిశీలన
Follow Us On : WhatsApp


