రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని కర్తవ్యం : మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

కలం, ఖమ్మం బ్యూరో : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి నిధులను సాధించగలిగితే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ హక్కులు, నిధుల కోసం పోరాడాలని ఆయన సూచించారు. పాల్వంచ సుగుణా గార్డెన్స్ లో సిపిఐ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల శిక్షణా శిబిరంలో భాగంగా శనివారం భారత రాజ్యాంగం స్థానిక సంస్థలు అభివృద్ధి, ప్రజాప్రతినిధులు నిధులు, విధులు అనే అంశంపై బోధించారు. భారతదేశ పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి లోబడి పని చేయాలని రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు కేటాయించబడ్డాయన్నారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రభుత్వాల విషయంలో కొంత నిర్లక్ష్యం ఉండేదని 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తేనే నిధులు కేటాయించే పరిస్థితి ఏర్పడిందని ఆయన (Srinivas Reddy) తెలిపారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులు నిలిపివేసిందని.. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేసిందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీలకు 90 శాతం నిధులు జనాభా ప్రతిపాదికన పది శాతం నిధులు, వైశాల్యం ప్రతిపాదికన కేటాయించబడతాయన్నారు. నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షత ఉండదన్నారు. గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్, కార్పోరేషన్ ప్రతినిధులు ముందుగా తమ విధులు, బాధ్యతలను గుర్తెరుగాలని ఆయన సూచించారు.

అధికారాన్ని గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని సిపిఐ ప్రజాప్రతినిధులు మంచిని ప్రోత్సహిస్తూ అభివృద్ధి పదంలో నడిపించినప్పుడే పార్టీకి గుర్తింపు లభిస్తుందన్నారు. భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు మార్చలేనివి ఉన్నాయని ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సమానత్వ, గణతంత్ర విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం గురించి, దేశభక్తి గురించి మాట్లాడుతున్న బిజెపి లేదా దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ మొదలైనవి రాజ్యాంగం అమల్లోకి వచ్చిననాడు తమ పత్రిక ఆర్గనైజర్లో దేశానికి ఇక దుర్దినమని ప్రకటించారన్నారు రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఇక చీకటి రోజులంటూ వార్తలు ప్రచురించడంతో పాటు జాతీయ జెండాను ఏనాడు ఆర్ఎస్ఎస్ ఇతర బిజెపి అనుబంధ సంస్థలు గౌరవించ లేదన్నారు. నాగపూర్లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో బిజెపి అధికారంలోకి వచ్చేంత వరకు జాతీయ జెండాను ఆవిష్కరించలేదని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ప్రజలకు అనుకూలంగా చట్టాలు చేయడం తప్పు కాదు..

ప్రజలకు అనుకూలంగా చట్టాలు చేయడం తప్పు కాదని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా అణగారిన వర్గాలు రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ మోసపూరిత లెక్కలు ప్రజా జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని తలసరి ఆదాయం పెంపు కూడా ఇబ్బందికరమేనన్నారు. తెలంగాణలో సైతం పదివేల కోట్ల పైబడిన సంపన్నులు తయారయ్యారని ఆయన తెలిపారు. దేశ పౌరులుగా హక్కుల కోసం పోరాడటంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఈ శిక్షణా తరగతుల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>