కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) –2026 సదస్సులో భాగంగా మంగళవారం దావోస్ (Davos) లో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సమావేశమైంది.
ఈ భేటీలో తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని వివరించారు. దీనిపై స్పందించిన విల్లెమ్ ఉయిజెన్ హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు.
అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణకు యూనిలీవర్ విలువైన భాగస్వామి అని, వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలతో తెలంగాణ వ్యాపారాలకు అనుకూల రాష్ట్రంగా నిలుస్తోంది అని మంత్రి వెల్లడించారు.
సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా తెలంగాణ రైజింగ్ బృందం, రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో త్వరగా వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలీవర్ కంపెనీని ఆహ్వానించారు. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు వంటి యూనిలీవర్ లక్ష్యాలను, తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

Read Also: రాముడికి బీజేపీలో సభ్యత్వం ఉంది : ఎంపీ అరవింద్
Follow Us On : WhatsApp


