కలం, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు ముందుకొచ్చింది (Davos Summit). వ్యవసాయం, వాతావరణ మార్పులు, పట్టణ కాలుష్యం తదితర సమస్యల పరిష్కారంలో తెలంగాణతో భాగస్వామ్యం పంచుకోనుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల అభివృద్ధిలో రాష్ట్రానికి సహకారం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించింది.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ పోరమ్ సదస్సు (Davos Summit) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం.. గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా(ఏపీఏసీ) ప్రెసిడెంట్ గుప్తా, ఆ కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మొదటి ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. ప్రధానంగా వాతావరణంలో మార్పులు – వ్యవసాయంపై ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారంపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి నమూనా వివరించారు. కోర్ హైదరాబాద్ సిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు ఇచ్చేలా పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను సీఎం ప్రస్తావించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ, బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలాతో భాగస్వామ్యం, ఏఐ పాఠ్యాంశాల అమలును ప్రస్తావించారు. ప్రభుత్వం.. పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా, టీ-ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోందని వివరించారు.
అనంతరం సంజయ్ గుప్తా మాట్లాడారు. రాష్ట్రం ప్రతిపాదించిన అంశాల్లో పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందన్నారు.


