కలం, నిజామాబాద్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటిఆర్, హరీశ్ రావులు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని టిపిసిసి చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల లబ్ధికోసం నోటీసులు ఇస్తున్నారనేది సమంజసం కాదని కొట్టిపారేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత నేరం.. అలాంటి నేరం బిఆర్ఎస్ నాయకులు చేశారని విమర్శించారు. సినీ నిర్మాతలు, తారలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని గుర్తు చేశారు. సిట్ విచారణలో రాజకీయ కక్ష కోణం లేదని స్పష్టం చేశారు. నిజంగా తప్పు చేయకుంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన సింగరేణి కాంట్రాక్టులు, 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన టెండర్లపై చర్చకు రావాలని సవాల్ చేశారు. పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నాయకుల తప్పిదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని వాటిపై నోటీసులు ఇస్తే బాధ ఎందుకని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో పస లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేశారు. సింగరేణి కాంట్రాక్టులు బిఆర్ఎస్ హయాంలో జరిగాయని ఆక్షేపించారు. బిఆర్ఎస్ హయాంలో 20 శాతం ఎక్సెస్ టెండర్లు జరిగాయని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని శాఖలను ప్రక్షాళన చేశామని అన్నారు. పదేళ్ల బిఆర్ ఎస్ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. సిఎం బంధువు సృజన్ రెడ్డిపై ఆరోపణలు చేసి దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఖండించారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన మహేష్ గౌడ్ శ్రీరాముని పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ అభివృద్ధి జరుగుతుందని వివరించారు.


