Mobile Popup Ad
Mobile Popup Ad

‘బడ్జెట్ బేసిక్స్’పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్

కలం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం (BRSLP Meeting) మంగళవారం జరగనున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సమావేశంలో ఓరియంటేషన్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం మొదలు ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, తలసరి ఆదాయం.. ఇలాంటి అనేక అంశాలపై సభ్యులకు అవగాహన కల్గించాలన్న ఉద్దేశంతో ఉదయం మొదలు సాయంత్రం వరకు ఓరియంటేషన్ తరగతులు జరగనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆనవాయితీగా నిర్వహించే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈసారి గోల్కొండ రిసార్టులో జరుగుతున్నది. పార్టీలో కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్ మీద అవగాహన కలిగించడంతో పాటు వివిధ పథకాలు, డిపార్టుమెంట్లకు నిధుల కేటాయింపు, శాసన వ్యవహారాలపై పరిజ్ఞానం తదితరాలను కల్పించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నది.

పార్టీ అధినేత కేసీఆర్ హాజరుపై నో క్లారిటీ :

పార్టీ తరఫున జరుగుతున్న ఈ సమావేశానికి అధినేత హోదాలో కేసీఆర్ (KCR) హాజరవుతారో లేదో ఇప్పటికింకా క్లారిటీ లేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నందున వారికి పలు అంశాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఎజెండా. మొత్తం మూడు సెషన్లుగా ఈ ఓరియంటేషన్ జరగనున్నది. బడ్జెట్‌ను సులభ శైలిలో అకడమిక్ కోణం నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివరించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వివిధ డిపార్టుమెంట్లకు కేటాయించే నిధులు, వాటికి అనుసరించే వైఖరి, ప్రభుత్వ విజన్.. ఇలాంటి అంశాలపై గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు అవగాహన కలిగించనున్నారు. శాసనసభలో నియమాలు, నిబంధనలు, సభ్యులు వ్యవహరించాల్సిన విధానం, వారి విధులు.. ఇలాంటి అంశాలపై రాజకీయ కోణం నుంచి రావుల చంద్రశేఖరరెడ్డి వివరించనున్నారు.

కొత్తగా ఎన్నికైన సభ్యులు తక్కువే :

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఓరియంటేషన్ క్లాసులు పెడుతున్నా మొత్తం 37 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేవలం ఐదుగురే కొత్తవారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, విజయుడు, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, అనిల్ జాదవ్ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గతంలో పార్లమెంటు సభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా వ్యవహరించినవారే. ఇక తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నందున ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యే అవకాశం లేదు. మిగిలిన 28 మందీ గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నవారే. ఐదుగురి కోసం ఓరియంటేషన్ పెట్టడంపై పార్టీ లీడర్లలోనే చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం, అనుసరించాల్సిన వైఖరిపై ప్రధాన ఫోకస్ పెట్టడానికి బదులు ఓరియంటేషన్ మీద దృష్టి పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేటీఆర్ ముగింపు ప్రసంగం :

ఉదయం మొదలు సాయంత్రం వరకు జరిగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో (Orientation Program) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కంక్లూజన్ స్పీచ్ ఇవ్వనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, వ్యూహం గురించి వివరిస్తారా?.. లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై పార్టీ ప్రోగ్రామ్‌ను వెల్లడిస్తారా?.. లేక అసెంబ్లీ దృష్టిని ఆకర్షించేలా పార్టీ నేతృత్వంలో బయట జరిగే ఆందోళనల గురించి హింట్ ఇస్తారా?.. ఇలాంటి సస్పెన్స్ నెలకొన్నది. పార్టీ అధినేత హాజరు కావడం అనుమానమే ఉద్దేశంతో కేటీఆర్‌కు ముగింపు సెషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. శాసనమండలి సభ్యుడు మధుసూదనా చారి కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు (BRSLP Meeting) హాజరవుతున్నారు. సీనియర్ లీడర్ కావడంతో కేసీఆర్ ప్రతినిధిగా వ్యవహరించే అవకాశమున్నది.

Read Also: వార్​ ఎఫెక్ట్​ : పాక్​లో స్కూళ్లు మూత.. జీతాల్లో కోత​

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>