కలం, తెలంగాణ బ్యూరో : “తెలంగాణలో మావోయిస్టు (Maoist) రాష్ట్ర కమిటీ పూర్తిగా అంతరించిపోయింది.. గణపతి సహా మిగిలిన కొద్దిమంది కూడా లొంగిపోవాలి.. బుల్లెట్ దారి వదిలి బ్యాలెట్ మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలి.. రాష్ట్రంలో హింసకు తావులేదు..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు స్టేట్ కమిటీయే లేనప్పుడు ఆ పార్టీ యాక్టివిటీస్ కూడా దాదాపుగా లేవన్నది సీఎం ఉద్దేశం. మావోయిస్టుల ఏరివేత కోసమే పెట్టిన గ్రే హౌండ్స్ (Greyhounds), యాంటీ నక్సల్ స్క్వాడ్ (Anti-Naxal Squad) విభాగాలు ఇకపైన ఏం పనిచేయాలనే సందేహాలు తలెత్తాయి. ఈ విభాగాలను ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందా?.. అవసరం లేదని తీసేస్తుందా?.. వీటిని కౌంటర్ టెర్రరిజం (Counter Terrorism) యాక్టివిటీస్ వైపు మళ్లిస్తుందా?.. లేక డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించేలా ఈగల్ ఫోర్స్ టాస్క్ అప్పగిస్తుందా?.. ఇలాంటి ప్రశ్నలకు ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) తర్వాత క్లారిటీ రానున్నది.
మూడున్నర దశాబ్దాలుగా ఉనికిలో.. :
పీపుల్స్ వార్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్న కాలంలో 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ కేఎస్ వ్యాస్ ఆలోచనకు అనుగుణంగా పుట్టుకొచ్చిందే గ్రేహౌండ్స్ (Greyhounds) విభాగం. దట్టమైన అడవుల్లో కూంబింగ్ చేయడం, నక్సలైట్ క్యాంపులపై దాడులు చేయడం, సాయుధ దళాలపై మెరుపు దాడులు చేయడం.. ఇలాంటి టాస్క్ లతో మూడున్నర దశాబ్దాలకు పైగా యాక్టివ్ రోల్ పోషించింది. గెరిల్లా యుద్ధంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ విభాగం ఎట్టకేలకు సక్సెస్ అయింది. ఇతర రాష్ట్రాలకు ట్రెయినింగ్ ఇచ్చింది. వాటితో సమన్వయం చేసుకుని సంయుక్త దాడుల్లో పాలుపంచుకున్నది. అత్యుత్తమ యాంటీ నక్సల్ ఆపరేషన్ విభాగంగా గుర్తింపు పొందింది. భౌగోళిక, వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో సైతం నక్సలైట్ల ఏరివేత చర్యల్లో రోల్ మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు రాష్ట్రంలో మావోయిస్టు పార్టీయే లేనప్పుడు, ఆ ఉద్యమమూ లేనప్పుడు ఈ విభాగం అవసరమేంటున్న చర్చ మొదలైంది.
జంగిల్ వార్‌ఫేర్‌లో స్పెషల్ ట్రెయినింగ్ :
అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫీసర్ పర్యవేక్షణలో పనిచేసే గ్రే హౌండ్స్ (Greyhounds) విభాగంలోని పోలీసులకు గెరిల్లా యుద్ధ మెలకువులతో పాటు అడవుల్లో నక్సలైట్లతో కొట్లాడేందుకు జంగిల్ వార్‌ఫేర్ ట్రెయినింగ్ ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. యువకులను మాత్రమే రిక్రూట్ చేసుకుని ఈ విభాగానికి వినియోగించేది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు మూడు వేల మందికి పైగా ఉండే ఈ విభాగం తెలంగాణ ఏర్పడిన తర్వాత 1200 మందితో పనిచేస్తున్నది. గరిష్టంగా 35 ఏండ్ల వయసు దాటగానే గ్రే హౌండ్స్ నుంచి ఇతర విభాగాల్లోకి బదిలీ కావడం రెగ్యులర్ ప్రాక్టీస్. రాత్రిపూట ఆపరేషన్లలో పాల్గొనడంతో పాటు లైట్ మెషీన్ గన్, టివోర్, ఎం-5, ఏకే-47 లాంటి ఆటోమేటిక్ రైఫిళ్ల వాడకంలో నిష్ణాతులు. తిండి, నిద్ర, నడక తదితర ప్రతికూల పరిస్థితులను సైతం లెక్క చేయకుండా ఆపరేషన్లలో పాల్గొనే శిక్షణతో గ్రే హౌండ్స్ విభాగానికి ‘ఎలైట్ ఫోర్స్’ అనే గుర్తింపు దక్కింది.
నెరవేరిన లక్ష్యం :
నిర్దిష్టమైన లక్ష్యం కోసం ఏర్పడిన గ్రే హౌండ్స్ మూడున్నర దశాబ్దాల్లో ఆ టాస్క్ ను కంప్లీట్ చేసుకున్నట్లయింది. పీపుల్స్ వార్ కాలంలో ఉనికిలోకి వచ్చిన ఈ విభాగం ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు పార్టీ యాక్టివిటీస్‌ను దాదాపుగా పూర్తి స్థాయిలో లేకుండా చేయగలిగిందన్నది ప్రభుత్వ ఉద్దేశం. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలని, ఆ పార్టీ నాయకులను ఏరివేయాలని, యాక్టివిటీస్‌ను అణచివేయాలన్న లక్ష్యం పూర్తికావడంతో దీని తదుపరి టాస్క్ ఏంటన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కూంబింగ్ ఆపరేషన్లు, జంగల్ వార్‌ఫేర్, గెరిల్లా యుద్ద తంత్రం.. ఇలాంటివన్నీ ఇప్పటి పరిస్థితుల్లో అవసరం లేకపోవడంతో ఈ విభాగం పోలీసులను ఇతర అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దాదాపు 1200 మంది పోలీసులు, కమెండోలు భవిష్యత్తులో ఏ విభాగంలోకి వెళ్తారనేది ఆసక్తికరం.
యాంటీ నార్కొటిక్స్ అవసరాల కోసం.. :
ఒకప్పుడు నక్సలైట్ల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఉపయోగపడిన గ్రేహౌండ్స్ విభాగాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో రద్దు చేయకుండా ఇలాగే కొనసాగిస్తుందన్నది పోలీసు వర్గాల వాదన. యాంటీ నక్సల్ ఆపరేషన్లకు బదులు యాంటీ నార్కొటిక్స్ టాస్క్ లోకి వెళ్లవచ్చని భావిస్తున్నాయి. ఈ విభాగంలోని పోలీసులను ఏ అవసరాలకు వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం ఒక కమిటీని వేయాలనుకుంటున్నది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో డీజీపీ, గ్రేహౌండ్స్ చీఫ్‌లు సభ్యులుగా ఉండే ఈ కమిటీ ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా తదుపరి నిర్ణయం జరగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి లాంటి డ్రగ్స్ భూతాన్ని సమూలంగా నిర్మూలించేందుకు యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, ఈగల్ ఫోర్స్ కు అటాచ్ చేసి డ్రగ్ పెడ్లర్లను ఏరివేసేందుకు వాడే అవకాశమున్నది. కొద్దిమందిని సైబర్ క్రైమ్ కట్టడి కోసం వాడుకునే అవకాశమున్నట్లు ప్రాథమిక సమాచారం. కమిటీ ఇచ్చే రేషనలైజ్ ఫార్ములా, ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం స్పష్టతకు రానున్నది.
Read Also: కల్తీ మాల్.. ప్రాణాలకి డేంజర్ బెల్స్
Follow Us On : WhatsApp

