కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran), అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్నాయి. ఇజ్రాయెల్-అమెరికా వర్గం ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ (Dubai), కువైట్‌లోని ప్రజలకు ఇరాన్ మిలటరీ కమాండ్ కీలక హెచ్చరిక చేసింది. ప్రజలంతా కూడా తమ ఇంటికి, దగ్గరల్లోని బ్యాంకుకు మధ్య దూరం చెక్ చేసుకోవాలని, బ్యాంకుకు కిలోమీటర్ రేడియస్‌లో ఉంటే మాత్రం వాళ్లు బాంబు దాడుల రాడార్‌లో ఉన్నట్లేనని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో సంబంధం ఉన్న ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులు ఇకపై తమ సైనిక లక్ష్యాలని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం టెహ్రాన్‌లోని ‘బ్యాంక్ సెపా’పై జరిగిన వైమానిక దాడి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఈ బ్యాంకు భవనం ధ్వంసమై పలువురు ఉద్యోగులు మరణించారు. దీనికి ప్రతికారంగా, గల్ఫ్ ప్రాంతంలోని సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ బ్యాంకులన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ దళాల ఉమ్మడి ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రకటించింది. సామాన్య ప్రజలు ఏ బ్యాంకుకైనా కనీసం ఒక కిలోమీటరు దూరంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించలేమని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది.
గతంలో చమురు రవాణా మార్గాలను, ఆ తర్వాత డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, ఇప్పుడు నేరుగా ప్రజల సొమ్ముపై ప్రభావం చూపే ‘మనీ వార్’ను ఎంచుకుంది. ఈ ప్రకటనతో గల్ఫ్ దేశాల్లోని మాల్స్, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు వంటి జనసంచారం ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు ఆందోళనలో పడ్డాయి. క్షిపణి ప్రయోగించకపోయినా, ఈ హెచ్చరికతో డిపాజిటర్లలో భయం మొదలై బ్యాంక్ దివాళాకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ (Iran) సైన్యం 31 స్వతంత్ర కమాండ్ల చేతుల్లో ఉందని, వారు ఎవరి ఆదేశాల కోసం వేచి చూడకుండా దాడులు చేసే అధికారం కలిగి ఉన్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి.

