epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

యాప్ వచ్చినా యూరియా కష్టం తీరలే

కలం, నల్లగొండ బ్యూరో: అన్నదాతలకు యూరియా (Urea) గోస తప్పడం లేదు. యాసంగి సీజన్ ఊపందుకోవడంతో రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వానాకాలంలో యూరియా కొరత నేపథ్యంలో రైతాంగం పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో యూరియా కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌తో యూరియా కష్టాలకు చెక్ పడినట్టేనని ప్రచారం జరిగింది. కానీ తీరా క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం యూరియా కష్టాలు షరా మాములుగానే మారాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కష్టాలు తారస్థాయికి చేరాయి. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా ఇచ్చే పరిస్థితి లేకపోవడం, యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వస్తుండడం వల్ల ఆ ఆన్‌లైన్ విధానంపై రైతాంగానికి అవగాహన లేక ముప్పుతిప్పలు పడుతున్నారు. మరోవైపు యూరియా మాత్రం ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చినా మాయమవుతూనే ఉంది.

క్షణాల్లో స్టాక్ ఖాళీ

యూరియా (Urea) కోసం రైతులు జిల్లాలోని ఏ ఎరువులైనా దుకాణం నుంచైనా బుక్ చేసుకుని తీసుకోవచ్చు. ఉదాహరణకు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రైతు శాలిగౌరారం మండలంలోని ఎరువుల దుకాణం నుంచైనా యూరియా కొనుగోలు చేయవచ్చు. ఇదే అసలు సమస్యగా మారింది. ఆన్‌లైన్ బుకింగ్ విధానం పట్ట పెద్దగా అవగాహన లేని రైతులు యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకునేలోపే దగ్గరలోని ఎరువుల దుకాణాల్లో స్టాక్ ఖాళీ అవుతోంది. దీంతో సూదూర ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలా చేస్తే.. అక్కడి నుంచి యూరియా బస్తాలు తీసుకొచ్చేందుకు ఒక్కో బస్తాపై రూ.100 అదనంగా రవాణ ఛార్జీ పడుతోంది. యూరియా బస్తాలు కొనుగోలు చేసే ధర కంటే.. రవాణ ఛార్జీలకే అదనంగా చెల్లించాల్సి వస్తుండడంతో రైతులకు భారంగా మారుతోంది. మర్రిగూడ మండలంలోని ఓ ఎరువుల దుకాణానికి మంగళవారం లారీ లోడ్ యూరియా బస్తాలు వచ్చాయి. అయితే అప్పటికే యాప్‌లో బుకింగ్ విధానంపై అవగాహన ఉన్నోళ్లు.. ముందస్తు సమాచారం ఉన్నవారంతా క్షణాల్లో బుక్ చేసుకోవడంతో 444 బస్తాల యూరియా పట్టుమని 10 నిమిషాల్లోపే ఖాళీ అయ్యింది. ఈ విషయం తెలియక అక్కడికి వచ్చిన మహిళా రైతులు గంటల తరబడి ఎదురుచూసి.. నిరాశతో ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిపోయారు.

డివిజన్‌కు పరిమితం చేస్తేనే బెటర్

ప్రస్తుతం రైతులు స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా యూరియాను జిల్లాలోని ఏ ఎరువుల దుకాణం నుంచైనా బుక్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో కొంతమేర మొబైల్ పరిజ్ణానం ఉన్న రైతులు యూరియా వచ్చిందనే సమాచారం తెలియగానే టక్కున బుక్ చేసుకుంటున్నారు. దీంతో మిగిలిన సన్న, చిన్నకారు రైతులకు దగ్గర ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాల్లో యూరియా దొరకడం లేదు. ఇటీవల మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఓ రైతు యూరియా బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ విధానంలో సంప్రదించగా.. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే శాలిగౌరారం, కేతేపల్లి మండలాల్లోని ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్ ఉన్నట్టు చూపించింది. సదరు రైతుకు 10 నుంచి 15 బస్తాలు మాత్రమే అవసరం ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి బుక్ చేసుకుని మిర్యాలగూడకు తీసుకురావాలంటే.. ఆటోకు ట్రాన్స్‌పోర్ట్ ఖరీదు రూ.1500 వరకు అవుతుంది. అంటే దాదాపుగా యూరియా బస్తా కొనుగోలు చేసినంత పని అవుతుంది. ఇదీ రైతాంగానికి భారంగా మారుతుంది. రైతులకు సమీప దుకాణాల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుందని.. తీరా అక్కడికి వెళ్ళినప్పటికీ యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాప్‌లో ఒక మండలం లేదా డివిజన్‌ను పరిమితం చేస్తే.. ఈ కష్టాలు ఉండబోవని రైతాంగం అభిప్రాయపడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>