epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

మిగిలింది 17 మందే.. లొంగిపోవాలంటూ డీజీపీ పిలుపు

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి నుంచి మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ దగ్గర పడుతున్నది. ఈ ఏడాది మార్చి 31 లోగా మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తామని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు, వందలాది మంది లొంగుబాటు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. దానికి కొనసాగింపుగా తెలంగాణ పోలీసు శాఖ సైతం చర్యలు ముమ్మరం చేసింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో తదనుగుణమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ నేతలు (Maoist Leaders) ఇంకా 17 మంది ఉన్నట్లు గుర్తించింది. వారు కూడా సరెండర్ కావాలంటూ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం లొంగిపోయినవారికి పునరావాసంతో పాటు వారి మీద ప్రకటించిన రివార్డును అందిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ సౌకర్యాలూ అందే ఏర్పాట్లు :

రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు ఘటనలు లేకపోయినా లొంగుబాట్లపై పోలీసు శాఖ సీరియస్ దృష్టి పెట్టింది. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. అజ్ఞాత జీవితంలో ఉన్న మావోయిస్టులకు చేరేలా పలు రూపాల్లో ఎమోషనల్ మెసేజ్ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గతేడాది మొత్తం వివిధ స్థాయిల్లోని మావోయిస్టు లీడర్లు (Maoist Leaders), కేడర్ 576 మంది లొంగిపోయారని, మిగిలినవారూ లొంగిపోవాల్సిందిగా అప్పీల్ చేస్తున్నది. అజ్ఞాత జీవితం విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసినవారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హతకు వీలుగా అందిస్తామని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయినవారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇకపైన లొంగిపోయేవారికి కూడా ఇవి అమలవుతాయన్నారు. ఇండ్లస్థలాలు, ఇండ్ల నిర్మాణం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యం.. వీటన్నింటిపైనా హామీలిస్తున్నారు.

ఆ 17 మంది మావోయిస్టులు వీరే :

“పోరు వద్దు – ఊరు ముద్దు… అజ్ఞాతం వీడండి.. జనంలోకి వచ్చేయండి… ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పిస్తాం” అంటూ అజ్ఞాత మావోయిస్టులకు రాష్ట్ర పోలీస్ శాఖ అప్పీల్ చేస్తున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేతలు ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నవారు 17 మందేనని పోలీసు శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులు, బంధువులు చొరవ తీసుకుని జనజీవన స్రవంతిలో కలిసేలా పిలుపునివ్వాలని సూచిస్తున్నది. ఇప్పటివరకు పోలీసు రికార్డుల్లో ఉన్న 17 మంది మావోయిస్టులు వీరే :

1. ముప్పాళ్ల లక్ష్మణ్ రావు @ గణపతి – కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్‌బ్యూరో సభ్యుడు (CCM & PBM). రివార్డు రూ.25 లక్షలు.
2. తిప్పిరి తిరుపతి @ దేవ్‌జీ – పార్టీ జనరల్ సెక్రటరీ, కేంద్ర కమిటీ, పోలిట్‌బ్యూరో సభ్యుడు. రివార్డు రూ.25 లక్షలు.
3. మల్లా రాజి రెడ్డి @ సంగ్రామ్ – కేంద్ర కమిటీ సభ్యుడు, రివార్డు రూ.25 లక్షలు.
4. పుసునూరి నరహరి @ సంతోష్ – కేంద్ర కమిటీ సభ్యుడు, ఈఆర్‌బీ (ఈస్ట్ రీజినల్ బ్యూరో) సభ్యుడు. జార్ఖండ్‌లో కార్యకలాపాలు. రివార్డు రూ.20 లక్షలు.
5. ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి. రివార్డు రూ.20 లక్షలు.
6. వార్తా శేఖర్ @ మంగ్తు – డీకేఎస్‌జెడ్‌సీ సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జి. రివార్డు రూ.20 లక్షలు.
7. జోడే రత్నాబాయి @ సుజాత – కేంద్రకమిటీ సభ్యురాలు, డీకేఎస్‌జెడ్‌సీ ఇన్‌చార్జి. రివార్డు రూ.20 లక్షలు.
8. లోకేటి చందర్ రావు @ ప్రభాకర్ – వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.
9. బడే చొక్కారావు @ దామోదర్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇన్‌చార్జి. రివార్డు రూ.20 లక్షలు.
10. నక్కా సుశీల @ రేలా, డీసీఎం స్థాయి కేడర్. రివార్డ్ రూ. 5 లక్షలు.
11. జాడి పుష్ప @ రాజేశ్వరి – డీసీఎం స్థాయి కేడర్. రివార్డు రూ.5 లక్షలు.
12. రంగబోయిన భాగ్య @ రూపి – ఏరియా కమిటీ స్థాయి క్యాడర్. రివార్డు రూ. 4. లక్షలు.
13. బాదిషా ఉంగ @ మంతు – ఏరియా కమిటీ స్థాయి కేడర్. రివార్డు రూ. 4 లక్షలు.
14. మడావి అడుమె @ సంగీత – ఏరియా కమిటీ స్థాయి కేడర్. రివార్డు రూ.4 లక్షలు.
15. కాశపోగు భవాని @ సుగుణ – ఏరియా కమిటీ స్థాయి క్యాడర్. రివార్డు రూ. 4 లక్షలు.
16. కుంజం ఇడమల్ – ఏరియా కమిటీ స్థాయి కేడర్. రివార్డు రూ. 4 లక్షలు.
17. ఉతిమి అనిల్ కుమార్ @ భగత్ సింగ్ – పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్. రివార్డు రూ.1 లక్ష.

Read Also: అక్రమాస్తుల కేసు: వరంగల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>