కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ (PSL 11) సీజన్‌కు ముందు సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. పదేళ్ల పాటు PSLలో సాగిన తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆటగాడిగా గడిపిన కాలం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని మాలిక్ పేర్కొన్నాడు. మైదానంలో సాధించిన విజయాలు, సహ ఆటగాళ్లతో ఏర్పడిన అనుబంధాలు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపాడు. ఇకపై ఆటగాడిగా కొనసాగకపోయినా, క్రికెట్ అభివృద్ధికి సేవ చేయాలనే ఆలోచన కొనసాగుతుందని స్పష్టం చేశాడు.
PSL ఆరంభం నుంచే మాలిక్ కీలక పాత్ర పోషించాడు. కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పేశావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 10వ సీజన్‌లో క్వెట్టా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. PSL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాలిక్ నాలుగో స్థానంలో నిలిచాడు. 92 మ్యాచ్‌ల్లో 2,350 పరుగులు సాధించి 33.09 సగటు నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు 17 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభను నిరూపించాడు.
టీ20 క్రికెట్ మొత్తంగా 13,571 పరుగులు సాధించిన మాలిక్, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల సాధకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. 2009 టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) విజేత పాకిస్థాన్ (Pakistan) జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు. తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడు. మొత్తంగా 446 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మాలిక్, 11,867 పరుగులు సాధించి 218 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.


