కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా పనిచేస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) చెప్పారు. ఈ మధ్య కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయని.. మోసగాళ్లు డాట్ వెబ్ ద్వారా ఇల్లీగల్ వస్తువులు అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ కౌన్సిల్ ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను ప్రజలు నమ్మొద్దు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ డిఫెన్స్ డ్రైవ్ కలిగి ఉండాలి. చుట్టూ పరిసరాలను కనిపెడుతుండాలి’ అంటూ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిందని, సంవత్సరంలో 7 వేల మందికి పైగా మరణిస్తున్నట్టు డీజీపీ వివరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలిపారు. అందుకే అవగాహన కోసం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ను ఉద్యమంలా చేపట్టామని.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి.
రెండు పోలీస్ స్టేషన్ల కొత్త బిల్డింగులు ప్రారంభం..
డీజీపీ శివధర్ రెడ్డి DGP Shivadhar Reddy రెండు పోలీస్ స్టేషన్ల బిల్డింగుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డికి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు. బైపాస్ కు దగ్గరలో నిర్మించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, దాస్ నగర్ వద్ద నిర్మించిన మాక్లూర్ పోలీసు స్టేషన్ బిల్డింగులను డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సీపీ సాయి చైతన్య ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: మేడారంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం
Follow Us On: Sharechat


