epaper
Friday, January 23, 2026
spot_img
epaper

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మెతుకు ఆనంద్‌కు లీగల్ నోటీసులు

కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు (Methuku Anand) లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు. జనవరి 14, 19 తేదీల్లో వికారాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్లలో మెతుకు ఆనంద్‌ స్పీకర్‌పై నిరాధారమైన, అసత్యమైన, వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఆయన లంచాలు తీసుకొని కొట్టివేశారంటూ మెతుకు ఆనంద్ దూషించారు. అలాగే వికారాబాద్‌ మున్సిపాలిటీ వ్యవహారాలను స్పీకర్‌ కుటుంబమే నియంత్రిస్తూ వ్యక్తిగత లాభాలు పొందుతోందన్న ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా కల్పితమని ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాదులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు

మెతుకు ఆనంద్ (Methuku Anand) మీడియా సమావేశాల్లో స్పీకర్‌ను అనుచిత పదజాలంతో దూషించడమే కాకుండా, అధికారుల పోస్టింగుల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోడ్లు–భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులే స్పీకర్‌ను కలవడానికి భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

రాజకీయకక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని నోటీసులో ఆరోపించారు. ఇవి స్పీకర్‌ వ్యక్తిగత ప్రతిష్ఠకే కాకుండా శాసనసభ గౌరవం, హక్కులకు భంగం కలిగించే చర్యలుగా పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత – 2023లోని సెక్షన్‌ 356 (ఐపీసీ 499, 500లకు సమానం) కింద మెతుకు ఆనంద్ చేసిన ఆరోపణలు స్పష్టంగా పరువు నష్టం కిందకు వస్తాయని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల స్పీకర్‌కు మానసిక వేదన చెందారని.. ఆయనకు సామాజిక అవమానం జరిగిందని పేర్కొన్నారు. రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఏడు రోజుల్లోగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, మీడియా వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నోటీసులో సూచించారు. నిర్ణీత గడువులోగా ఈ షరతులు పాటించకపోతే పరువు నష్టం, శాసనసభ హక్కుల ఉల్లంఘనపై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read Also: అమెజాన్​ ఉద్యోగులకు ముంచుకొస్తున్న లేఆఫ్​ గడువు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>