కలం, వెబ్ డెస్క్ : టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సూర్యకుమార్ ఎందుకు పరుగులు చేయలేకపోతున్నాడు అనేది ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో భారీగా చర్చిస్తున్న విషయం. ఈ క్రమంలోనే కెప్టెన్సీ ఒత్తిడి (Captaincy Pressure) వల్లే సూర్యకుమార్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని, ఆ ఒత్తిడి ప్రభావం సూర్యపై భారీగానే ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజాగా దీనిపై సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, తాను బ్యాటింగ్ బాగానే చేస్తున్నానని, పరుగులు అవే వస్తాయని చెప్పారు.
కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మ్యాచ్‌లలోనే భారీ పరుగులు చేశానని తెలిపారు. ఇంత పెద్ద జట్టుకు నాయకత్వం వహిస్తే ఒత్తిడి సహజమే. ఒత్తిడి లేకుండా ఎవరూ ఆడరు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఫామ్ కొంత తగ్గింది. అయితే తొలి 7–8 టీ20 మ్యాచ్‌లలో ఒక సెంచరీతో పాటు కొన్ని అర్ధశతకాలు చేశాను అని అన్నారు. ఇవన్నీ ఆటలో జరిగే విషయాలేనని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో తనకు మళ్లీ టచ్ దొరికే అవకాశం ఉందని సూర్యకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కష్టపడి పనిచేయడం తన చేతుల్లోనే ఉందని, జట్టును బాగా నడిపించడం కూడా తన బాధ్యత అని తెలిపారు. తాను బాగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఏమో.. రేపే ఫామ్ దొరికి వరల్డ్ కప్ ముగిసే వరకు అంతే కొనసాగవచ్చని సూర్యకుమార్ అన్నారు.


