కలం, వెబ్ డెస్క్ : డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ (Rashmi Group), తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సదస్సులో భాగంగా దావోస్‌లో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి భినందించారు.
తెలంగాణ విభిన్న పరిశ్రమలతో బలమైన పారిశ్రామిక వ్యవస్థగా ఎదుగుతోందని , ముఖ్యంగా తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయాలు, బొగ్గు సరఫరా లింకేజీలు సహా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలంగాణ రైజింగ్ బృందంతో భేటీ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ లేబర్–ఇంటెన్సివ్ తయారీ విధానంతో పనిచేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని డైరెక్టర్ సంజిబ్ కుమార్ తెలిపారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగాయి. రష్మి గ్రూప్ (Rashmi Group) ఆసియాలోని 40 దేశాలు, యూరప్, ఆఫ్రికా, ఉత్తర,దక్షిణ అమెరికా దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Read Also: దావోస్‌లో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ
Follow Us On: Sharechat


