కలం, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ (Republic Day Parade 2026) ఘనంగా జరిగింది. భారతావని సర్వతోముఖాభివృద్ధిని ప్రతిబింబించేలా వేడుకలు అబ్బురపరిచాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక పురోగతి, సైనిక శక్తిని చాటాయి. ఈ వేడుకల్లో ఆపరేషన్ ‘సిందూర్’ సందర్భంగా ఉపయోగించిన మిస్సైల్స్, యుద్ధ విమానాలు, రక్షణ వ్యవవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఆయుధాల ప్రతిరూపాలతో రూపొందించిన త్రివిధ దళాల శకటం ఆకట్టుకుంది. అలాగే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణులతోపాటు ఎస్–400 రక్షణ వ్యవస్థతో ఏర్పాటుచేసిన ఆపరేషనల్ సెంటర్‌ను కూడా ప్రదర్శించారు. అపాచీ హెలికాప్టర్లు ఆపరేషన్ సిందూర్ పతకాన్ని ప్రదర్శిస్తూ అంతరిక్షంలో చేసిన విన్యాసం అబ్బురపరిచింది. ఈ ఏడాది పరేడ్ థీమ్‌గా ‘వందే మాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భం ఎంచుకున్నప్పటికీ, నిరుడు మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ కూడా పరేడ్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పరేడ్ పత్యేకతలివీ..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశిష్ట అతిథులతో కలిసి సంప్రదాయ బగ్గీలో కర్తవ్య పథ్‌కు చేరుకుని గౌరవ వందనం స్వీకరించడంతో పరేడ్ (Republic Day Parade 2026) ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, సైన్యాధిపతులు, విదేశీ దౌత్యవేత్తలు తదితరులు హాజరయ్యారు.
- భారత సైన్యం మొట్టమొదటి సారి ‘బాటిల్ అరే ఫార్మాట్’.. (అంటే యుద్ధ రంగంలో దళాలు ఎలా? ఏ వరుసలో కదులుతాయో అలా) ప్రదర్శించింది.
- ధ్రువ్, రుద్ర ఆయుధ హెలికాప్టర్లు ‘ప్రహార్ ఫార్మేషన్’లో ఎగిరాయి. టీ90 భీష్మ, అర్జున్ యుద్ధ ట్యాంకులు, అపాచీ ఏహెచ్–64ఈ, ప్రచండ్ లైట్ కాంబట్ హెలికాఫ్టర్లు కవాతులో పాల్గొన్నాయి.
- బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి, నాగ్ క్షిపణి వ్యవస్థలు, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్, అర్జున్ ప్రధాన యుద్ధట్యాంక్ సహా అనేక స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు.
- ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంశంతో సుమారు 100 మంది కళాకారులు వివిధ సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చి, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు.
- రెండో తరం సైనికాధికారి, లెఫ్టినెంట్ జనరల్ భవనీశ్ కుమార్ (ఢిల్లీ ఏరియా జీఓసీ) పరేడ్‌కు నాయకత్వం వహించారు.
- యూరప్ వెలుపల మొట్టమొదటి సారి ఈ తరహా వేడుకల్లో యూరోపియన్ యూనియన్ సైనిక దళం పాల్గొంది.
- ‘బలమైన దేశానికి బలమైన నౌకాదళం’ అనే అంశంతో నౌకాదళ శకటం ప్రదర్శించారు. ఇందులో ఐదవ శతాబ్దానికి చెందిన నౌక INSV కౌండిన్య, మరాఠా నౌకాదళానికి చెందిన గురాబ్ తరహా నౌకలు, INS విక్రాంత్, INS ఉదయగిరి వంటి ఆధునిక నౌకలు చూపించారు. ఇండియన్ నేవీ నుంచి 144 సిబ్బందితో కూడిన బృందం పరేడ్‌లో పాల్గొంది.
- వాయుసేన బృందం నలుగురు అధికారులు, 144 మంది వైమానిక సిబ్బందితో పరేడ్‌లో పాల్గొంది. రఫేల్, మిగ్-29, సుఖోయ్-30, జాగ్వార్ యుద్ధవిమానాలు ‘సిందూర్ ఫార్మేషన్’గా ఫ్లైపాస్ట్ నిర్వహించాయి.
- మొత్తం 29 విమానాలతో వైమానిక విన్యాసం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రఫేల్, సుఖోయ్-30, మిగ్-29, జాగ్వార్ యుద్ధవిమానాలతోపాటు సి-130, సి-295, నౌకాదళానికి చెందిన పి-ఎస్ఐ విమానాలు పాల్గొన్నాయి.
- స్థిర, కదిలే లక్ష్యాలను ఛేదించగల హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణి LR-AShMని డీఆర్‌డీఓ ప్రదర్శించింది.
- మొత్తం 30 శకటాలు (17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు; 13 కేంద్ర మంత్రిత్వ శాఖలు) పరేడ్‌లో పాల్గొన్నాయి. 77వ గణతంత్ర దినోత్సవ థీమ్ వందే మాతరం గీతానికి 150 ఏళ్లుతోపాటు, దేశ అభివృద్ధిని ప్రతిబింబించాయి.
- సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందాలతో కూడిన ‘డేర్‌డెవిల్స్’ బైక్ స్టంట్స్ ప్రేక్షకులను అలరించాయి.
Read Also: పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Follow Us On : WhatsApp


