కలం, నల్లగొండ బ్యూరో: చెర్వుగట్టు (Chervugattu) రామలింగేశ్వరుడి కల్యాణానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 4 గంటలకే ఇసుకేస్తే రాలనంతగా చెర్వుగట్టు జనసంద్రంగా మారిపోయింది. అర్చకుల వేదమంత్రాలు.. మంగళవాయిద్యాలు.. వేలాది మంది భక్తజనం నడుమ వరుడు రామలింగేశ్వరుడు.. వధువు పార్వతీ అమ్మవారి మెడలో తాళికట్టారు. ఈ అపురూప వేడకకు నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వేదికైంది. ఈ వేడుకతో శివనామస్మరణతో చెర్వుగట్టు మార్మోగింది. ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి రోజున నిర్వహించే పార్వతీపరమేశ్వరుల కల్యాణ ఘట్టం కమనీయంగా సాగింది.
ఆలయ (Chervugattu) ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కల్యాణ క్రతువుకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham), పుష్ప దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం తలంబ్రాల తంతు.. ఆ తర్వాత కల్యాణ ఘట్టం ముగిసింది. స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు యావత్ తెలంగాణ నుంచి పోటెత్తారు. పార్వతీరామలింగేశ్వర స్వామి జంటకు తలంబ్రాలు సమర్పించేందుకు భారీగా క్యూకట్టారు. దీంతో క్వింటాళ్ల కొద్దీ తలంబ్రాలు రాశులుగా పోగయ్యాయి. పార్వతీపరమేశ్వరులకు ఆనవాయితీగా తలంబ్రాలు సమర్పించి భక్తులు (Devotees) తమ మొక్కలు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
Read Also: హాలియాలో వృద్ధురాలి దారుణ హత్య
Follow Us On: Sharechat


