కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) తన విచారణను స్పీడప్ చేసింది. బీఆర్ఎస్ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ బాధితులను, ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులను ఇప్పటికే ప్రత్యేక బృందం విచారించింది. మరింత లోతైన విచారణ కోసం, పటిష్టమైన చార్జిషీట్ దాఖలు కోసం ప్రభుత్వం నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందం ఇప్పటివరకూ పలువురి నుంచి సేకరించిన వివరాలు, ఆధారాలు, వారు స్టేట్‌మెంట్‌లో వెల్లడించిన అంశాల ఆధారంగా ఎంక్వైరీని వేగవంతం చేస్తున్నది. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను మంగళవారం సిట్ విచారించింది. పలు అంశాలపై ఆయనను ప్రశ్నించింది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతను ఈ కేసులో (Phone Tapping Case) విచారణకు పిలవడం ఇదే మొదటిసారి. మళ్లీ హరీశ్ రావును విచారణకు పిలుస్తామని సజ్జనార్ ఓపెన్‌గానే చెప్పారు. ఆ తర్వాత వంతు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)దే అవుతుందని, ఎప్పుడైనా ఆయనకు పిలుపు రావచ్చన్న అనుమానాలు ఆ పార్టీ కేడర్‌ను కలవరపెడ్తున్నాయి.
‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఇష్యూ బూమరాంగ్ :
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందంటూ 2022 అక్టోబర్‌లో అప్పటి సీఎం హోదాలో కేసీఆర్ కొన్ని ఆడియో టేపులను, వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. పలు రాష్ట్రాల హైకోర్టు జడ్జీలకూ పంపారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వేదికగా ఈ కుట్ర జరిగిందని, దాన్ని తాము ఛేదించామని చెప్పుకొచ్చారు. బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ (BL Santhosh) పై కేసీఆర్ ప్రధాన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ వ్యవహారమే బూమరాంగ్ అయ్యేలా ఉంది. ఆ కేసు కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణను వైపు నడిపిస్తున్నది. నాడు ఆడియో టేపులు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని సిట్ ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ నాడు తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఆడియో టేపులు ఎలా వచ్చాయి?.. ఎవరిచ్చారు?… ఎలా రికార్డు అయ్యాయి?.. అనే కోణంలో సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
Read Also: ‘సిట్’ ముందుకు కవిత?.. త్వరలో సమన్లు జారీ?
Follow Us On: Instagram


