కలం, వెబ్ డెస్క్: నైనీ బొగ్గు టెండర్లలో అవకతవకలు జరిగాయని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన రాధా కృష్ణ కథనాన్ని పలు దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. భట్టి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వాళ్లు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెద్దవాళ్ల మెప్పు కోసమే సదరు పత్రిక అలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్‌లో దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆంధ్రజ్యోతిలో నైనీ బొగ్గు టెండర్లలో అక్రమాలు జరిగాయని పూర్తి అసత్యాలతో కథనాన్ని వేశారన్నారు. భట్టి విక్రమార్కపై దురుద్దేశంతో ఊహాజనిత కథనాలు జోడించి ప్రచురించారన్నారు.
రాష్ట్రంలో రాజకీయంగా ఎదుగుతున్న దళిత నాయకులను అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఆ కథనంలో వచ్చినట్లు సీఎం దగ్గరే సింగరేణి ఉంటుందన్నది నిజం కాదన్నారు. భట్టి తన వాళ్లకు టెండర్ దక్కేలా చేశారన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. భట్టి అధికారంలోకి వచ్చాక సింగరేణిలో ఎన్నో సంస్కరణలు చేపట్టారని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం గోదావరిఖనిలో క్యాథలాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నాయకుడు భట్టి అని పేర్కొన్నారు. అలాంటి భట్టిపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి దృష్టి పెట్టకుండా ఇలాంటి కుట్రపూరిత కథనాలు ప్రచురించడం మానుకోవాలని హితవు పలికారు.


