epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

‘సిట్’ ముందుకు కవిత?.. త్వరలో సమన్లు జారీ?

కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kavitha) సైతం పోలీసులు పిలుస్తారా?.. సమన్లు జారీ అవుతాయా?.. ఆమె వాంగ్మూలాన్ని ‘సిట్’ రికార్డు చేస్తుందా?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జాగృతి వర్గాల నుంచి మాత్రం ‘ఔను’ అనే సమాధానమే వస్తున్నది. ఒక బాధితురాలిగా ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంతో పాటు ఆమె దగ్గరున్న ఆధారాలను పోలీసులు సేకరించే అవకాశమున్నది. కవితతో పాటు ఆమె భర్త అనిల్‌ను కూడా పిలిచే అవకాశమున్నదన్నది ఆ వర్గాల సమాచారం. కేసు దర్యాప్తును తొందరగా ముగించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల కామెంట్లు చేసిన నేపథ్యంలో కవితకు నోటీసులు జారీ కావడంపై చర్చ జరుగుతున్నది. ఏ సమయంలో నోటీసులు ఇచ్చినా హాజరై ఆమె తన వివరణను ఇస్తారని జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు.

బాధితురాలిగా స్టేట్‌మెంట్ రికార్డు :

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు ఎక్కువగా నిందితులపైనే ఇంతకాలం ఫోకస్ పెట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ లాంటి అధికారులతో పాటు హరీశ్‌రావు లాంటి పలువురు రాజకీయ నాయకులనూ ప్రశ్నించారు. కొద్దిమంది బాధితుల నుంచి కూడా వివరాలను సేకరించారు. మరికొద్దిమంది సాక్షులనూ విచారించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మొదలు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వ్యాపారవేత్త నందకుమార్ తదితరుల నుంచి కూడా వివరాలను తీసుకున్నారు. కొద్దిమంది విట్నెస్‌లుగా స్టేట్‌మెంట్ ఇస్తే మరికొందరు వారి ఫోన్లు ఎప్పుడు ట్యాపింగ్‌కు గురయ్యాయో పోలీసులకు వివరాలు ఇచ్చారు. కొందరు పత్రికాధిపతులు, జర్నలిస్టులు సైతం విచారణకు హాజరై వివరాలు అందించారు. ఇప్పుడు అదే తరహాలో కవిత వంతు కూడా వస్తుందన్నది జాగృతి కార్యకర్తల అభిప్రాయం.

ఇంటల్లుడి ఫోన్‌నూ ట్యాపింగ్ చేస్తారా? :

ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్‌కు ఇటీవల విజ్ఞప్తి చేసిన సందర్భంగా “ఇంటల్లుడి ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారా?.. సిగ్గుండాలి… కేటీఆర్ భార్య ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకుండేవారా?..” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. సిట్ ముందు హాజరై వివరాలను అందజేస్తానని కూడా అన్నారు. ఆమె (Kavitha) ఈ కామెంట్లు చేసిన తర్వాతనే ప్రభుత్వం సజ్జనార్ నేతృత్వంలో పది మందితో సిట్ ను ఏర్పాటు చేసింది. ఫోన్ ట్యాపింగ్‌పై కామెంట్లు చేసినందున తగిన ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేసి ఎంక్వయిరీకి పిలిచే అవకాశమున్నది. బాధితుడిగా ఆమె భర్త అనిల్‌ను సైతం పిలిచి ఆ ఫోన్ నెంబర్ కాల్‌డేటా ఆధారంగా ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసే అవకాశమున్నది.

Read Also: తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>