epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

కేంద్రం కీలక నిర్ణయం.. చట్టసభలకు ఇకపై ర్యాంకింగ్స్

కలం, తెలంగాణ బ్యూరో : పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ రాష్ట్రాలకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (EoDB) ర్యాంకులు ఇస్తున్నట్లుగానే ఇకపైన చట్టసభలకు కూడా ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. నేషనల్ లెజిస్లేటివ్ ఇండెక్స్ (National Legislative Index) అనే పేరుతో కొత్త విధానానికి శ్రీకారం చుడితే వివిధ రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుందనేది కేంద్రం భావన. ఇదే విషయాన్ని లక్నోలో జరిగిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (AIPOC)లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచనప్రాయంగా తెలిపారు. చట్టసభల పనితీరును లెక్కించడానికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించి వాటి ఆధారంగా ర్యాంకులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తక్కువ ర్యాంక్ వచ్చిన రాష్ట్రాలపై ప్రజల్లో చెడు అభిప్రాయం కలుగుతుందని, తద్వారా మంచి ర్యాంకు కోసం నిర్దిష్ట ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెడతాయన్నది దాని వెనక ఉద్దేశం.

కనీసంగా ఏడాదికి 30 రోజులు సభ :

చట్టసభలు ఇటీవల రాజకీయ ఆధిపత్యానికి, అధికార పార్టీ బలప్రదర్శనకు వేదికలుగా మారాయన్న విమర్శలు నెలకొన్నాయి. ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి బదులు నినాదాలకు, విపక్షాల గొంతు నొక్కడానికి కేంద్రాలుగా మారాయన్న భావనా ఉన్నది. అవి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే, ప్రజా ప్రతినిధులు జవాబుదారీతనంతో వ్యవహరించే సభలుగా నిలవాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం ఏడాదిలో కనీసం 30 రోజుల పాటు సభా సమావేశాలు జరగాలని స్పీకర్ ఓం బిర్లా (Om Birla) నొక్కిచెప్పారు., ఎక్కువ సమయం ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం, పాలనాపరంగా సేవలను సమర్ధవంతంగా అందించడం, ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఇవి పనిచేయాలని సూచించారు.

మెరుగైన సమావేశాలకు కొలమానమేంటి? :

నేషనల్ లెజిస్లేటివ్ ఇండెక్స్ (National Legislative Index) విధానం ద్వారా ఆయా రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్ళ పనితీరును కొలవడానికి నిర్దిష్టమైన ప్రమాణాలను లోక్‌సభ స్పీకర్ సూచించారు. ఒక సంవత్సరంలో సభా సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరిగాయి?.. కనీసం 30 రోజులు నడవాలన్న నిబంధన అమలైందా?.. సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు ఎన్ని గంటల పాటు జరిగాయి?.. నినాదాలు, నిరసనలతో ఎంత సమయం వృథా అయింది?.. సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు మంత్రులు, ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు ఇచ్చింది?.. ప్రభుత్వం ఇచ్చిన వివరణల్లో నాణ్యత ఎంత?.. నేషనల్ ఈ-విధాన్ అనే డిజిటల్ టెక్నాలజీని ఎన్ని చట్టసభలు వాడుతున్నాయి?.. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను సభా కమిటీలు ఏ మేరకు పరిశీలిస్తున్నాయి?.. ఇలాంటి పలు అంశాల ఆధారంగా ఆయా చట్టసభల పనితీరు నిర్ధారణ అవుతుంది.

ర్యాంకింగ్ నిర్ధారణకు ప్రత్యేక కమిటీ :

ప్రతీ చట్టసభ పనితీరును కొలిచేందుకు నిర్దేశించుకున్న ప్రమాణాల ఆధారంగా ర్యాంకింగ్‌లను ప్రత్యేకంగా ఒక కమిటీ అధ్యయనం చేసి నిర్ణయిస్తుంది. ఇప్పటికే కమిటీ ఏర్పాటైంది. చట్టసభల పనితీరు మెరుగుపడడంలో ర్యాంకింగ్ విధానం వస్తే రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. తక్కువ ర్యాంక్ వస్తే దేశవ్యాప్తంగా ఆ రాష్ట్ర ఇమేజ్ ప్రశ్నార్థకమవుతుంది. నియోజకవర్గ అభివృద్ధి గురించి, తమ సమస్యల గురించి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చర్చించడం లేదనే సాధారణ అభిప్రాయం ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్నది. నేషనల్ లెజిస్లేచర్ ఇండెక్స్ ద్వారా ర్యాంకింగ్ సిస్టమ్ అమల్లోకి వస్తే మొత్తం రాష్ట్రంమీదనే అది ప్రభావం చూపుతుంది. దీంతో చట్టసభల పనితీరు మెరుగుపర్చుకోడానికి అటు ప్రభుత్వాలు, ఇటు పార్టీలు, ఇంకోవైపు ప్రజా ప్రతినిధులు జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో పనిచేస్తారనే అభిప్రాయం కూడా ఉన్నది.

ఒకే ప్లాట్‌ఫామ్ మీదకు చట్టసభలు :

నేషనల్ లెజిస్లేచర్ ఇండెక్స్ సంపూర్ణంగా అమల్లోకి వస్తే అన్ని రాష్ట్రాల చట్టసభల పనితీరు ఒకే ప్లాట్‌ఫామ్ మీదకు వస్తాయి. ఏ రాష్ట్రానికి చెందిన చట్టసభలు ఎంత సమర్ధవంతంగా సమావేశాలను నిర్వహించాయో మిగిలిన రాష్ట్రాలకూ తెలిసిపోతుంది. ప్రజలు సైతం ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టాయి.. ఎన్ని ఆమోదం పొందాయి… స్థానిక సమస్యలకు పరిష్కారం దొరికిందా.. సభ సజావుగా జరిగిందా.. నిరసనలతో మొక్కుబడిగా జరిగాయా… ఇలాంటివన్నీ ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు గ్రహిస్తారు. దీంతో సమావేశాల్లో సమయం వృథా కావడం తగ్గిపోతుందనేది లోక్‌సభ స్పీకర్ భావన. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఇది అమల్లోకి వస్తుందని సంకేతం ఇవ్వడంతో చట్టసభల పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏ మేరకు మారుతుందో వేచి చూడాలి.

Read Also: మిగిలింది 17 మందే.. లొంగిపోవాలంటూ డీజీపీ పిలుపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>