కలం, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు (Nandyal Bus Accident) లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గురువారం కర్నూల్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. సిరివెల్లమెట్ట వద్దకు రాగానే బస్సు టైర్ పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను దాటుకొని పక్కనే వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. లారీలో టూ వీలర్ వాహనాలు ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే బ్యాటరీలు పేలి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, బస్సు అద్దాలు పగులగొట్టారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. లారీ, బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. మృతి చెందిన బస్సు డ్రైవర్‌ను కడపకు చెందిన ఓబులేసుగా గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలిస్తోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ట్రావెల్స్ బస్సు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Read Also: దేవుడికి 2కోట్ల ఆస్తి.. వృద్ధ దంపతుల నిర్ణయం
Follow Us On: Sharechat


