కలం, నల్లగొండ బ్యూరో : మద్యం దుకాణాల విషయంలో మునుగోడు (Munugode) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajgopal Reddy) వ్యూహం బెడిసికొట్టింది. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మద్యం దుకాణాల అమ్మకాలపై ఆంక్షలు విధించడంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు రాజగోపాల్ రెడ్డి అనుచరుల వీరంగం మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో మాత్రమే స్పెషల్ రూల్స్ అమలు విషయంలో క్రెడిట్ కొట్టేయాలని భావించిన రాజగోపాల్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. సర్కారు ఒక పాలసీని అమలు చేస్తే.. అంతటా ఒకేలా ఉండాలి. అలా కాదని మునుగోడుకు స్పెషల్ రూల్స్ అంటూ మద్యం వ్యాపారులపై ఒత్తిడి పెంచడం.. మద్యం దుకాణాల నిర్వాహకులు పలుమార్లు కలిసి రిక్వెస్ట్ చేసినా వినకపోవడంతో అసంతృప్తి పెరిగిపోయింది.
ఇదే సమయంలో వైన్స్ నిర్వాహకులపై రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడులు చేయడం.. మంత్రి రాజన్న అంటూ స్టిక్కర్లు అతికించిన కార్లలో తిరుగుతూ వైన్స్ నిర్వాహకులను బెదిరించడం పలుచోట్ల ఘర్షణలకు దారితీసింది. అయితే కాంగ్రెస్ సర్కారే మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి అమ్ముకోవాలని చెబితే.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సర్కారు నిర్ణయాన్ని ధిక్కరించడంపై టీపీసీసీ ఛీఫ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.
ఇరకాటంలో రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (Munugode) నియోజకవర్గంలో వైన్స్‌ల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఎంట్రీ ఇవ్వడం పరిస్థితి మారిపోయింది. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది దగ్గరుండి మరీ దుకాణాలను ఉదయం 10 గంటలకే ఓపెన్ చేయించి.. పహారా కాస్తూ అమ్మకాలు కొనసాగిస్తుండటంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇరకాటంలో పడిపోయారు. ఇటీవల వరకు తాను చెప్పినట్టుగా విన్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఒక్కసారిగా తిరగబడి మద్యం అమ్మకాలను దగ్గరుండి ప్రోత్సహించడంతో కాంగ్రెస్ నేతలకు షాక్ తిన్నంత పని అయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు ఆంక్షల మధ్య కొనసాగుతుండటం.. ప్రతి వారం పది రోజులకోసారి ఇది హాట్ టాపిక్‌గా మారుతుండడం.. ఇతర నియోజకవర్గాల్లో సిండికేట్ దందా పెద్దఎత్తున కొనసాగుతుండడం.. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడులో మద్యం అమ్మకాలు యథావిధిగా కొనసాగుతుండడంతో ఊపిరిపీల్చుకున్నట్టయ్యింది. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల వద్ద ఎక్సైజ్ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నవారిలో.. అంతకు ముందు మద్యం దుకాణాల నిర్వాహకులపై దాడులు చేసిన వారిలోనూ సగానికి పైగా మందుబాబులు ఉండటం కొసమెరుపు. అయితే ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించ లేదు.
Read Also: నెక్స్ట్ నోటీస్ ఎవరికి?.. కేసీఆర్‌కా?.. కవితకా?
Follow Us On: Pinterest


