కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) వేస్తున్న అడుగులు బీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కడంలేదు. సంబంధమే లేదనుకున్న వ్యక్తులకు సైతం నోటీసులు జారీ కావడం ఊహించని పరిణామంగా మారింది. ఏ రోజు ఎవరికి నోటీసులు వస్తాయో తెలియని గందరగోళం నెలకొన్నది. పార్టీలో కీలకంగా ఉన్న హరీశ్‌రావు, కేటీఆర్‌లను రెండు రోజుల వ్యవధిలోనే పిలవడంతో తదుపరి పిలుపు ఎవరికి అనే చర్చ మొదలైంది. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారనే ప్రచారంపై కేటీఆర్ స్పందిస్తూ… విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. దీంతో తదుపరి నోటీసులు కేసీఆర్‌కేనా?.. లేక ఆయన కుమార్తె కవితకా?.. (KCR – Kavitha) లేక మాజీ ఎంపీ సంతోష్‌రావుకా?.. అనే చర్చ మొదలైంది.
‘పెద్దాయన’ మాటలతో తప్పదా? :
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సహా పలువురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు సిట్ విచారణ సందర్భంగా ‘పెద్దాయన ఆదేశాల మేరకు’ అంటూ విచారణలో పేర్కొనడం, వాంగ్మూలాల్లో సైతం దాన్ని ప్రస్తావించడంతో ఇక నోటీసులు ఆ ‘పెద్దాయన’కేనా?.. అనే చర్చ మొదలైంది. పలువురి నోటివెంట ‘పెద్దాయన’ అనే ప్రస్తావన రావడం, కేటీఆర్ సైతం నోటీసులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంటూ వ్యాఖ్యానించడంతో ఇక ఎప్పుడైనా నోటీసులు తథ్యమనే అభిప్రాయం నెలకొన్నది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఇటీవల చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆమె వివరణను తీసుకునేందుకు ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశమున్నది. కేసీఆర్‌కు (KCR) నీడలా ఉండే మాజీ ఎంపీ సంతోష్‌రావుకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్‌కు నోటీసులిస్తే పరిణామాలేంటి?
హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడంతో విచారణ సందర్భంగా పోలీసు స్టేషన్ ముందు హడావిడి చోటుచేసుకున్నది. ఈ తరహాలోనే కేటీఆర్ విచారణ సందర్భంగానూ పార్టీ శ్రేణులు హల్‌చల్ చేశారు. వీరిద్దరి విచారణకే సందడి ఇలా ఉంటే ఇక కేసీఆర్‌కు నోటీసులిచ్చిన తర్వాత విచారణకు హజరైతే ఆ హడావిడి ఏ స్థాయిలో ఉంటుందోననే చర్చ మొదలైంది. అసలు నోటీసులు వస్తాయా?.. వచ్చినా విచారణకు హాజరవుతారా?.. లేక కోర్టును ఆశ్రయిస్తారా?.. ఇలాంటి మాటలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ను విచారించడంతోనే సిట్ దర్యాప్తు ప్రక్రియ దాదాపు ముగిసినట్లవుతుందని, ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారనున్నది. ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా?.. లేదా?.. అనేదే హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: టార్గెట్ హరీష్ రావు.. కవిత కౌంటర్లు..!
Follow Us On: Instagram


