కలం వెబ్ డెస్క్ : అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు, అవినీతి పనులకు బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) సిగ్గుతో తలదించుకోవాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Addanki Dayakar) అన్నారు. మంగళవారం ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విచారణ జరుగుతున్న సందర్భంగా అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నైతిక విలువలు పాటించకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడి సంపదను దోచుకున్నారని దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు దేశవ్యాప్తంగా తెలంగాణను అభాసుపాలు చేశారన్నారు.
నైతిక విలువలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు అధికారులతో తప్పుడు పనులు చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమ పనులు చేసేందుకు అధికారులను బెదిరించారన్నారు. చేసిన తప్పులపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీశ్ రావు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందేనని, చేసిన తప్పులకు సిగ్గుతో తల దించుకోవాలని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులపై పదేళ్లు విచారణ చేపట్టినా తప్పు లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారనడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించొచ్చు కానీ, తప్పు చేసి ప్రశ్నిస్తా అంటే కుదరదన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మీ గ్రూప్ నుంచి బయటికొచ్చిన కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.


