కలం/ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా పురపోరుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్ర నేతలు ఇక్కడ పర్యటించారు. అయితే ఖమ్మం (Khammam) మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పొత్తులు ఉంటాయా అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నెల 18న పాలేరులో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో కొందరు టీడీపీ జెండాలు పట్టుకుని ర్యాలీతో రావడం చర్చకు దారితీసింది. వారంతా జై చంద్రబాబు, జై రేవంత్ రెడ్డి అనే నినాదాలు చేశారు. వారిని చూసి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. టీడీపీని తొక్కేసిన బీఆర్ ఎస్ పార్టీని లేకుండా చేయాలని.. అప్పుడే సీనియర్ ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం టీడీపీ అభిమానులను ఉత్తేజపరిచింది. ఇది చూసిన వారంతా.. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందేమో అని చర్చించుకుంటున్నారు.
అంతకు ముందు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోతో పాటు వైసీపీ జెండాలు కనిపించాయి. కేటీఆర్ ర్యాలీలో వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వారంతా జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. జగన్ పుట్టిన రోజున గుంటూరు తాడేపల్లి వైసీపీ ఆఫీసు దగ్గర కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ ఎస్ తో వైసీపీ పొత్తులు పెట్టుకుని ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా పోటీ చేస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాలో టీడీపీకి, వైసీపీకి అభిమానులు బాగానే ఉన్నారు. మరి పురపోరులోకి వైసీపీ, టీడీపీ పొత్తులతో దిగుతాయా.. లేదంటే ఒంటరిగా దిగుతాయా.. ఇవేవీ వద్దని సైలెంట్ గా ఉంటాయా చూడాలి.


