కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో లోరియల్ (LOreal) సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబుతో లోరియల్ సీఈఓ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు లోరియల్ ప్రకటించింది. ఈ జీసీసీ ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభం కానుంది.
డిజిటల్ ట్రాన్సఫార్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలకు ఈ కేంద్రం ప్రధాన హబ్‌గా మారనుంది. దీంతో గ్లోబల్ టెక్ మ్యాప్‌లో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరగనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పెట్టుబడులతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని, తెలంగాణను గ్లోబల్ బ్యూటీ-టెక్ ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని అధికారులు వెల్లడించారు.
లోరియల్ సంస్థ చరిత్ర ఇదే..
ప్రపంచ బ్యూటీ, కాస్మెటిక్స్ రంగంలో లోరియల్ (LOreal) అగ్రగామి సంస్థగా ఉంది. 1909లో ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ కెమిస్టు యూజిన్ షుయెల్లర్ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఫ్రాన్స్‌లోని స్లిచిలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్, పర్ఫ్యూమ్స్, డెర్మా కాస్మెటిక్స్ వంటి విభాగాల్లో లోరియల్ విస్తృత ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. లోరియల్ పారిస్, మేబెలిన్, గార్నియర్, లాంకోమ్, కీల్‌స్, సెరావే, నైక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లు లోరియల్ గ్రూప్ ఆధీనంలో ఉన్నాయి.
150 దేశాల్లో విస్తరించిన లోరియల్
ప్రస్తుతం సుమారు 150 దేశాల్లో లోరియల్ వ్యాపారం విస్తరించి ఉంది. సంస్థలో 90 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లోరియల్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యూటీ సొల్యూషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. భారతదేశంలో 1994 నుంచి లోరియల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లోరియల్ ఇండియా, దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా పలు అంతర్జాతీయ బ్రాండ్లను అందిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రకటించింది. బ్యూటీ రంగంతో పాటు సుస్థిరత, మహిళా శాస్త్రవేత్తల ప్రోత్సాహం వంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల్లోనూ లోరియల్ కీలక పాత్ర పోషిస్తోంది.
Read Also: వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు
Follow Us On: Pinterest


