కలం వెబ్ డెస్క్ : నాసాకు 27 ఏళ్లుగా సేవలు అందించిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రిటైర్మెంట్ ప్రకటించారు. డిసెంబర్ 27 2025 నుంచి ఆమె అధికారికంగా రిటైర్ అయినట్లు నాసా (NASA) తాజాగా ప్రకటిచింది. సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో మూడు మిషన్లను పూర్తి చేసి మానవ అంతరిక్ష ప్రయాణంలో అనేక రికార్డులు సృష్టించారు. మహిళల్లో అత్యధికంగా 9 స్పేస్‌వాక్‌లు చేశారు. అలాగే 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసిన రికార్డు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. వీటితో పాటు అంతరిక్షంలో మారథాన్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐసాక్స్‌మేన్ సునీతా విలియమ్స్ కృషి భవిష్యత్తులో చంద్రుడు, మార్స్ అన్వేషణల్లో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. అంతరిక్షంలో గడిపిన క్షణాలు తన జీవితంలో అత్యంత గొప్ప అనుభవమన్నారు. నాసాకు 27 ఏళ్లు సేవలు అందించే అవకాశం దొరకడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో నాసా విజయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సునీతా విలియమ్స్ (Sunita Williams) నావల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రిటైర్ అయ్యే వరకు ఆమె నేవీ కెప్టెన్‌గా కూడా సేవలు అందించారు.
Read Also: లిక్కర్ షాపులో సీపీఐ నేత నారాయణ హడావుడి
Follow Us On : WhatsApp


