epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

చేతులు కలిపిన లష్కరే తోయిబా, హమాస్​.. భారత్ ఆందోళన

కలం, వెబ్​డెస్క్​: ఉగ్రవాదం మరింత విస్తరిస్తోందా? ఇప్పటివరకు ఆయా దేశాల్లో విడివిడిగా ఉన్న టెర్రరిస్ట్​ గ్రూపులు (Lashkar – Hamas) ఒక్కటవుతున్నాయా? గ్లోబల్​ టెర్రరిజానికి నాంది పలుకుతున్నాయా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పాలస్తీనా కేంద్రంగా పనిచేసే హమాస్​ ఉగ్ర సంస్థ, పాకిస్థాన్​ కేంద్రంగా నడిచే లష్కరే తోయిబా మధ్య బంధం బలపడడం ప్రపంచ దేశాల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా ఈ పరిణామం భారత్​కు ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల పాకిస్థాన్​ మర్కాజి ముస్లిం లీగ్​(పీఎంఎంఎల్​) కమాండర్​, పాకిస్థాన్​లోని సింధ్​ ప్రావిన్స్​లో పనిచేసే లష్కరే తోయిబా టెర్రరిస్ట్​ ఫైసల్​ నదీమ్​ ఓ వీడియోలో మాట్లాడుతూ.. తాను, పహల్గామ్​ ఉగ్రదాడి మాస్టర్​ మైండ్​ సైఫుల్లా కసూరి కలసి ఖతార్​ రాజధాని దోహాలో హమాస్​ లీడర్​ ఖాలేద్​ మసూల్​ను కలసినట్లు వెల్లడించాడు. మరోవైపు ఈ నెల 7న హమాస్​ సీనియర్​ కమాండర్​ నాజీ జహీర్​, లష్కర్​ కమాండర్​ రషీద్​ అలీ సంధూ పాకిస్థాన్​లోని గుజ్రన్​వాలాలో భేటీ అయినట్లు బయటపడింది. పీఎంఎంఎల్​ నిర్వహించిన ఒక బహిరంగ సమావేశంలో ఈ నేతలు కలసినట్లు వెల్లడైంది. వీళ్లు ఒకే వేదికపై కనిపించిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

ఈ క్రమంలో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హమాస్​, లష్కరే (Lashkar – Hamas) కలయిక దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో ఉగ్ర కార్యకలాపాలు పెంచే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెంచడంపై దృష్టి పెట్టాయి. అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత భద్రతా అధికారులు తెలిపారు.

కాగా, లష్కర్​, హమాస్ మధ్య సమన్వయం, సహకారం ప్రపంచ ఉగ్రవాద నెట్​వర్క్​లో ప్రమాదకర మార్పులకు సంకేతమని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఖండాంతర ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: అమెరికాలో తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>