epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

ఆదాయంలో మూడో వంతు అప్పులే.. 9 నెలల్లో రూ. 66 వేల కోట్లు

కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం (Telangana Govt) చేసిన అప్పుల్ని (Loans) తీర్చడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త అప్పులపై ఆధారపడుతున్నది. రాష్ట్రానికి తొమ్మిది నెలల్లో (మార్చి-డిసెంబరు 2025) సమకూరిన మొత్తం రూ. 1.90 లక్షల కోట్లలో రూ. 66 వేల కోట్లు (35%) రిజర్వు బ్యాంకు (RBI) నుంచి తీసుకున్న రుణాలే ఉన్నాయి. బడ్జెట్‌లో అంచనా వేసుకున్నదానికంటే అదనంగా అప్పులు (Borrowings) చేయాల్సి వస్తున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఈ ఏడాది రూ. 19,369 కోట్లను తీర్చాలని అనుకుంటే తొమ్మిది నెలల్లోనే రూ. 21,454 కోట్లను తీర్చేసింది. అప్పుల విషయంలో మొత్తం పన్నెండు నెలల్లో రూ. 55,116 కోట్లను తీసుకోవాలనుకుంటే తొమ్మిది నెలల్లోనే అది రూ. 65,930 కోట్లు దాటేసింది. పాత అప్పుల్ని తీర్చడానికి కొత్త అప్పులు చేయడం తప్పడంలేదు. కాగ్‌ (CAG)కు సమర్పించిన ప్రొవిజనల్ డేటాలో రాష్ట్ర ఆర్థిక శాఖ పై వివరాలను పేర్కొన్నది.

సంక్షేమం, పేమెంట్స్ కు కోత పెట్టి.. :

అభివృద్ధికి, సంక్షేమానికి, ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం చేయాల్సిన నిధులను పాత అప్పులు, వడ్డీలకు చెల్లించాల్సి వస్తున్నదంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రైతుభరోసా, ఉద్యోగుల డీఏ తదితరాలను పక్కన పెట్టి గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులను తీరుస్తూ ఉన్నట్లు గుర్తుచేశారు. తొమ్మిది నెలల్లోనే అంచనాకు మించి అప్పులు చేయడంలో జనవరి-మార్చి మధ్య మూడు నెలల్లో ఇంకెంత అప్పు తీసుకుంటుందోననే ఆందోళనా లేకపోలేదు. ఇక కేంద్రం నుంచి రూ. 22,782 కోట్ల మేర గ్రాంట్లు వస్తాయని బడ్జెట్‌లో రాష్ట్ర సర్కార్ అంచనా వేసుకుంటే కేవలం రూ. 3,805 కోట్లు (16.70%) మాత్రమే వచ్చింది. గతేడాది సైతం ఇది 22.05 %గానే నమోదైంది. తెలంగాణకు కేంద్రం ఇస్తున్నదానికంటే కేంద్రానికి మనం ఇస్తున్నదే ఎక్కువ అని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి సహకారం అందించడానికి బదులు వివక్ష చూపుతున్నదంటూ గత ప్రభుత్వమే కాక ఇప్పటి ప్రభుత్వం (Telangana Govt) కూడా విమర్శిస్తున్నది.

Read Also: ‘42% రిజర్వేషన్’ పాలసీ ఉత్తదేనా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>