కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు (Moinabad Farmhouse Drugs Case) కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటూ ఈగల్ టీమ్ కు పట్టుబడ్డారు.
ఈ కేసులో ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు నిర్వహించిన యూరిన్ టెస్టులో నెగెటివ్ రాగా తరువాత బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. విచారణ అనంతరం పోలీసులు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు నోటీసులు అందజేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. మరోవైపు ఈగల్ టీమ్ దాడుల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనను శంషాబాద్ పోలీసు స్టేషన్ నుంచి కోర్టుకు తరలించారు.

