కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)పై జబర్దస్త్ యాక్టర్ శాంతి స్వరూప్(Shanthi Swaroop) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేని గురించైనా మాట్లాడే ముందు పూర్తిగా తెలుసుకోవాలంటూ ఫైర్ అయ్యారు. ఏదైనా చెప్పే ముందు ఆలోచించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోలో హితవు పలికారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి, జనసేన ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ స్టేజీపై ఆయన యువతితో డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది కాస్తా మాజీ సీఎం వైయస్ జగన్ వరకూ వెళ్లింది. ఆయన మీడియా ముందు మంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి స్థానంలో ఉంటూ ప్రజల ముందు అశ్లీల డ్యాన్స్‌లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఉంది. ఆ వైరల్ వీడియోలో మంత్రితో ఉన్నది అమ్మాయి కాదు.. జబర్దస్త్ యాక్టర్ శాంతి స్వరూప్..!
లేడీ గెటప్ వేసుకున్న జబర్దస్త్(Jabardasth) యాక్టర్‌తో డ్యాన్స్ చేస్తే జగన్ మంత్రిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం ఏంటని జనసైనికులు ఫైర్ అయ్యారు. లేడీకి లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా నువ్వెలా సీఎం అయ్యావంటూ నెటిజన్లు జగన్‌ను ట్రోలింగ్ చేశారు. దీంతో శాంతి స్వరూప్ ఈ విషయంపై స్పందించారు. ఆరోజు మంత్రితో డ్యాన్స్ చేసింది లేడీ కాదని, లేడీ గెటప్‌లో ఉన్న తాననేని క్లారిటీ ఇచ్చారు. ఇక జగన్ అంటే ఎంతో అభిమానం ఉండేదని, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధపెట్టాయని పేర్కొన్నారు. తను వైసీపీ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొన్నానని, లేడీ గెటప్స్‌తో తనను గుర్తు పడతారు కాబట్టే ఆ వేషధారణలోనే ఎక్కడికైనా వెళ్తానని చెప్పుకొచ్చారు. తామంతా రిక్వెస్ట్ చేస్తేనే మంత్రి వాసంశెట్టి డ్యాన్స్ చేయడానికి వచ్చారని, ఆయనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. అయినా తాము చేసిన డ్యాన్స్‌లో ఏం అశ్లీలత ఉందని ప్రశ్నించారు.
గతంలో వైసీపీ వాళ్ల ప్రోగ్రాముల్లో కూడా డ్యాన్స్ చేశానని, ఒకసారి ఆ వీడియోలు ఈ వీడియోలు పోల్చుకొని చూసుకోవాలని శాంతి స్వరూప్ జగన్ కు సూచించారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకోవాలని, కార్యకర్తలైనా జగన్‌కు ఇలాంటి విషయాలు చెప్పాలని సూచించారు. లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా సీఎం ఎలా అయ్యావంటూ జగన్‌పై వస్తున్న ట్రోలింగ్‌కు నాకు బాధగా అనిపించిందని తెలిపారు. ఇంకోసారి ఇలా తమను అవమానించేలా మాట్లాడవద్దని, ఏదైనా ఉంటే తెలుసుకొని అప్పుడు మాట్లాడాలని సూచించారు. మరోవైపు జగన్ అభిమానులు మాత్రం జగన్ డ్యాన్స్ గురించి ప్రశ్నించారు కానీ, అక్కడ ఉన్నది మహిళనా కాదా అని అనలేదని కామెంట్లు చేస్తున్నారు.


