తీగ లాగనున్న ‘సిట్’.. బీఆర్ఎస్‌లో టెన్షన్…

కలం, తెలంగాణ బ్యూరో : మొయినాబాద్ ఫామ్ హౌజ్ (Moinabad Farmhouse) డ్రగ్స్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నది. ఆ ఫామ్ హౌజ్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిది (Pilot Rohith Reddy) కావడంతో ఇష్యూ సీరియస్ అవుతున్నది. బీఆర్ఎస్ నాయకుడైనందున, గతంలో ఇదే ఫామ్ హౌజ్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా నడిచినందున పాత కథ మొత్తం తెరమీదకు వచ్చే అవకాశమున్నది. డ్రగ్స్ తెచ్చిందీ, వాడిందీ, పాజిటివ్ టెస్ట్ వచ్చిందీ వాస్తవమని ఒకవైపు వాంగ్మూలం, మరోవైపు నార్కొటిక్ టెస్టుల్లో తేలడంతో రోహిత్‌రెడ్డి ప్రమేయం కుండబద్దలు కొట్టినట్లు వెల్లడైంది. ఇంతవరకు జరిగిన కథ ఎలా ఉన్నా ఇకపైన జరగబోయేదే బీఆర్ఎస్ నేతలను వణికిస్తున్నది. జరగబోయే దర్యాప్తును ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ సైతం షోకాజ్ నోటీసు జారీచేయక తప్పలేదు.

సిట్ ఏర్పాటుతో సర్వం వెలుగులోకి :

రోహిత్‌రెడ్డి ఫామ్ హౌజ్ వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటున్నది. అక్కడ డ్రగ్స్ మాత్రమే కాక తుపాకీ కాల్పులు కూడా జరగడం మొత్తం ఇష్యూను మరో డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళింది. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. డీజీపీ సైతం సిట్ ఏర్పాటుపై ఆదేశాలు జారీచేశారు. చేవెళ్ళ డీసీపీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. ఫామ్ హౌజ్‌ మూలాలు మొత్తం వెలుగులోకి వచ్చే అవకాశమున్నది. వీకెండ్ పార్టీకి వచ్చినవారితో రోహిత్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, ఎంతకాలం నుంచి కొనసాగుతున్నాయి, వారి మధ్య ఉన్న వ్యాపార లావాదేవీలు, రియల్ ఎస్టేట్ బిజినెస్.. ఇలా అన్ని కోణాల నుంచి సిట్ దర్యాప్తు చేయనున్నది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించి మరిన్ని వివరాలను రాబట్టాలన్నది పోలీసుల ఆలోచన.

టెన్షన్‌లో బీఆర్ఎస్ లీడర్లు :

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిన చందంగా రోహిత్‌రెడ్డి ఫామ్ హౌజ్ (Moinabad Farmhouse) వ్యవహారం బీఆర్ఎస్‌లో ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందనే గుబులు మొదలైంది. ఇది కేవలం తాజా డ్రగ్స్ దర్యాప్తుకు మాత్రమే పరిమితం కాదని, గతంలో జరిగిన మొత్తం వ్యవహారాలను సిట్ వెలికి తీస్తుందనేది గుబులు రేకెత్తిస్తున్నది. అందుకే గులాబీ లీడర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఈ ఫామ్ హౌజ్ కేంద్రంగానే జరగడంతో అప్పటి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశమున్నది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పసిగట్టిందని, దానికి తగినట్లుగా కేసీఆర్ డైరెక్షన్‌లోనే సీసీటీవీ కెమెరాల ఏర్పాటు జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పకడ్బందీగా వీడియో, ఆడియో ఫుటేజీ రికార్డింగ్‌ ప్లానింగ్ కూడా కేసీఆర్ నుంచే వచ్చిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇవన్నీ సిట్ దర్యాప్తుతో వెలికి వచ్చే అవకాశాలున్నాయి.

తీగ లాగి డొంకంతా కదులుతుందా..? :

డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ సీరియస్‌గా వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మూలాల్లేకుండా చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన. డ్రగ్స్ వ్యవహారం ఎంతకాలం నుంచి నడుస్తున్నది.. ఇక్కడికి సప్లై చేస్తున్నదెవరు.. సూత్రధారి, పాత్రధారి, మీడియేటర్లు ఎవరు.. ఫామ్ హౌజ్‌కు రెగ్యులర్‌గా వచ్చేదెవరు.. వారితో రోహిత్‌రెడ్డికి ఎలాంటి వ్యాపార బంధం ఉంది.. అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలులో ఎవరి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి.. పకడ్బందీ స్కెచ్ వేసి వీడియో ఫుటేజీ రికార్డింగ్‌లో ఏం జరిగింది.. ఆదేశాలు ఎవరివి.. అమలు చేసిందెవరు… ఇవన్నీ ఇప్పుడు రోహిత్‌రెడ్డి నుంచే సిట్ రాబట్టనున్నది. రోహిత్‌రెడ్డి నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి.. అది చివరకు ఎక్కడకు వెళ్తుంది.. ఇవీ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నవి. అదే సమయంలో గులాబీ లీడర్లను వణికిస్తున్నవి.

Read Also: ఇర్రెస్పాన్సిబుల్​ అపోజిషన్​: హోదా కావాలి.. బాధ్యతలు వద్దా..?

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>