కలం, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు(Railway Koduru) ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Arava Sridhar) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ హర్షవీణ గురించి ఆసక్తికర అంశం బయటపడింది. ఆమె గతంలోనే వివాహం చేసుకోగా, భర్తతో విబేధాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హర్షవీణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హర్ష వీణ బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో తన మాజీ భర్తపై చేసిన ఫిర్యాదు ప్రకారం ఆమెకు 2018లోనే సంసాని భవాని శంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. భవాని శంకర్ బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇద్దరికి ముందు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత భవాని శంకర్ ఆమెను అనుమానించడం మొదలుపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపింది. తనను పెళ్లి చేసుకొని తప్పు చేశానని, తనకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని తిట్టేవాడని వెల్లడించింది. భవాని శంకర్ తమ్ముడు శ్రీరాం కూడా తనను వేధించే వాడని, తన అన్నను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని ఫోన్‌లు చేసి తిట్టేవాడని తెలిపింది. తన అన్నను వదిలేయాని, లేదంటే చంపేస్తానని బెదిరించే వాడని చెప్పింది. తన భర్త తనను వదిలేసి బెంగళూర్‌లో ఉంటున్నాడని, ఈ ఇద్దరిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జనసైనికులు హర్షవీణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హర్ష వీణ ఈ వివాహం గురించి ఎక్కడా వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇక జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పరిచయం అనంతరం తన భర్త నాగమునిరెడ్డితో విబేధాలు వచ్చాయని ఆమె తెలిపింది. ఆమె చేస్తున్న ఆరోపణలు, విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జనసేన అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై వాస్తవాలు నిర్దారించేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నిజానిజాలు తేలిన తర్వాత అరవ శ్రీధర్(Arava Sridhar)పై పార్టీ చర్యలు తీసుకోనుంది. ఇక తాజాగా వైరల్ అవుతున్న హర్ష వీణ మరో వివాహం అంశంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.


