కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కేటీఆర్‌కు సిట్ (SIT) పోలీసులు నోటీసులు జారీ చేయడం, ఎంక్వయిరీకి పిలవడం బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడలేదు. ఏ సంబంధమూ లేదంటూ స్వయంగా కేటీఆర్ సైతం వివరణ ఇచ్చారు. అయినా నోటీసులు జారీ కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. రెండు రోజుల క్రితం హరీశ్‌రావు విచారణకు హాజరైన సందర్భంగా ఇచ్చిన సమాధానంతోనే కేటీఆర్‌కు (KTR) నోటీసులు జారీ అయ్యాయనే అనుమానాలు శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. ఆయన ఇచ్చిన లీడ్ ఆధారంగానే కేటీఆర్‌ను సిట్ ఎంక్వయిరీ చేయాల్సి వచ్చిందనేది వారి భావన. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నలకు హరీశ్‌రావు ఎలాంటి సమాధానం ఇచ్చారో… ఆ సమాధానాల్లో కేటీఆర్‌కు సంబంధం ఉండేలా వెల్లడైన అంశమేంటో… ఇవీ ఇప్పుడు కేటీఆర్ అభిమానుల్లో జరుగుతున్న చర్చ.
‘సిట్’ ఎంక్వయిరీ తెచ్చిన తంటా :
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ పోలీసులు చేస్తున్న విచారణ అనేక రకాల అనుమానాలకు కేంద్ర బిందువుగా మారింది. హరీశ్‌రావును విచారణ చేసే సమయంలో 2018లో ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ పోలీసులు కొన్ని వివరాలను ఆయన ముందు ఉంచినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ ఎవిడెన్సులను చూసిన తర్వాత హరీశ్‌రావు (Harish Rao) ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన అనుచరుల్లో టాక్ మొదలైంది. పార్టీకి నమ్మకంగా ఉన్నప్పటికీ ఆయన ఫోన్ సైతం ట్యాపింగ్ జాబితాలో ఉండడాన్ని అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్‌లో అనేక ఆధారాలను ధ్వంసం చేసినా ఇప్పటికీ పోలీసుల దగ్గర కొన్ని అందుబాటులో ఉండడం కీలకంగా మారింది. ఎవిడెన్సులన్నీ మాయమయ్యాయని అనుకున్నా ఆధారాలను విచారణ సందర్భంగా బహిర్గతం చేయడంతో సమాధానాలివ్వడం అనివార్యంగా మారుతున్నది.
‘సిట్’ తీరుతో ఇద్దరి మధ్య గ్యాప్?
ఒకవైపు తనకు తెలియకుండానే 2018లో ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని పోలీసులు ఆధారాలు చూపడంతో హరీశ్‌రావుతో పాటు ఆయన అనుచరుల్లోనూ గందరగోళం నెలకొన్నట్లయింది. అదే సమయంలో విచారణ సందర్భంగా ఆయన ఇచ్చిన సమాధానాలతోనే కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని ఈయన అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. ఇవన్నీ వీరిద్దరి మధ్య తేడాలు రావడానికి కారణమైందన్న గుసగుసలు షురూ అయ్యాయి. హరీశ్‌రావు సమాధానంతోనే కేటీఆర్ ఇరుకున పడాల్సి వచ్చిందని, ఉద్దేశపూర్వకమా?.. లేక యాధృచ్ఛికమా?.. అనేది తేల్చుకోవడం కేడర్ వంతయింది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ చేస్తున్న ఎంక్వయిరీ కేటీఆర్, హరీశ్‌రావు మధ్య గ్యాప్ పెరగడానికి, సరికొత్త సందేహాలు తలెత్తడానికి కారణమైందన్న మాటలు బీఆర్ఎస్ కేడర్‌లో వినిపిస్తున్నాయి.
పొలిటికల్‌గా కాంగ్రెస్‌కు మైలేజ్ ? :
బీఆర్ఎస్ అధినేత ఎక్కువ సమయం ఫామ్‌హౌజ్‌లోనే గడుపుతుండడంతో పార్టీ బాధ్యతలు, యాక్టివిటీస్ భారం కేటీఆర్, హరీశ్‌రావులపై పడింది. ఇద్దరూ ఎంత కలిసి ఉంటున్నా బావ, బామ్మర్దుల మధ్య కోల్డ్ వార్.. వీరిద్దరి మధ్య గ్యాప్… అంటూ పబ్లిక్‌లో రకరకాల ఊహాగానాలు దీర్ఘకాలంగానే కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) సందర్భంగా తలెత్తిన అనుమానాలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వీరిద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైందనే బీఆర్ఎస్ కేడర్ జనరల్ డిస్కషన్ ఎలా ఉన్నా ఆ గ్యాప్ ఎంత ఎక్కువైతే పొలిటికల్‌గా అంత వీక్ అవుతుందని, అదే సమయంలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఒక రకంగా సిట్ పోలీసుల ఎంక్వయిరీ ప్రాసెస్ రెండు రాజకీయ ప్రత్యర్థుల (కాంగ్రెస్, బీఆర్ఎస్)పై ప్రభావం చూపడానికి దారితీసినట్లయింది.
Read Also: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు
Follow Us On: Sharechat


