కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్(Pakistan)లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ఖురేషీ మోర్ ప్రాంతంలో శాంతి కమిటీ సభ్యుడు నూర్ ఆలమ్ మెహ్సూద్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి అతిథులు ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలతో అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మృతుల్లో శాంతి కమిటీ నాయకుడు వాహీదుల్లా మెహ్సూద్ కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పూర్తిగా దిగ్బంధించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా సీఎం సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. ఇటీవలే ఇదే రాష్ట్రంలోని బన్నూ జిల్లాలో శాంతి కమిటీ సభ్యులపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. గత నవంబర్‌లో కూడా ఇక్కడే జరిగిన మరో దాడిలో ఏడుగురు మృతి చెందారు.
Read Also: అమెరికాను కమ్మేసిన మంచు.. 2 వేలకు పైగా విమానాలు రద్దు
Follow Us On: Youtube


