కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫిబ్రవరి 6న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ సమీపంలోని కేషాపూర్ గ్రామంలో ఏర్పాటుచేయబోయే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. కేషాపూర్ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి ఆహ్వానం మేరకు రేవంత్ పర్యటించనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి జిల్లాలో అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రేవంత్ పర్యటన సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలలో కూడా పాల్గొంటారని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారని అన్నారు. సీఎం రేవంత్ నిజామాబాద్ జిల్లాలో అధికారిక పర్యటన చేయడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత.. నిజామాబాద్ పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు చేసి ప్రకటిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.


