కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (municipal elections) నగారా మోగడంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ డీజీపీ ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల (municipal elections) విధులను పర్యవేక్షించేందుకు, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించేందుకు హైదరాబాద్‌లో 24/7 పనిచేసే ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తారు.
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధిస్తున్నారు. 50 వేల రూపాయలకు మించి నగదును తీసుకువెళ్తున్నట్లయితే, ఆ సొమ్ముకు సంబంధించిన సరైన ఆధారాలను చూపించాలని డీజీపీ స్పష్టం చేశారు. ఒకవేళ తగిన ధృవీకరణ పత్రాలు లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


