కలం, నల్లగొండ బ్యూరో : ప్రాజెక్టులు వస్తే కష్టాలు పోతాయని నమ్మారు. తమ భూములు పోయినా వేలమందికి ప్రయోజనం ఉంటదంటే.. అనాదిగా వస్తున్న భూముల్ని, ఇళ్లను వదిలిపోయేందుకు సిద్దం అయ్యారు. అందుకు ఫలితంగా పరిహారం ఇస్తామని అన్నారు. సర్కారు మాట తప్పుతుందా.. అని నమ్మి ఊరు మొత్తం ఖాళీ చేశారు. తీరా చూస్తే.. పదేళ్ళు దాటినా పైసా పరిహారం రాలేదు. పైగా పరిహారం ఇవ్వాలని అడిగితే పోలీసులతో తన్ని తరిమేస్తున్నారు. ఇదీ చర్లగూడెం రిజర్వాయర్‌లో (Cherlagudem Reservoir) భాగంగా సర్వం కోల్పోయిన నర్సిరెడ్డిగూడెం గ్రామస్తుల కన్నీటి కథ.
నల్లగొండ జిల్లాలోని దిండి ఎత్తిపోతల పథకం (Dindi Lift Irrigation Scheme) లో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణానికి బీఆర్ఎస్ (BRS) సర్కారు హయాంలో 2015 సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ (KCR) శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకెపల్లి, వెంకెపల్లి తండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ నాలుగు గ్రామాల్లోనూ దాదాపు 1600 పైగా కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ సన్న, చిన్నకారు రైతులు, నిత్యం కూలీ పనులు చేసేవారే అధికం. అయితే ఈ రిజర్వాయర్ (Cherlagudem Reservoir) నిర్మాణం కోసం నామమాత్రపు పరిహారం ఇచ్చి 4వేల ఎకరాలకు పైగా సేకరించారు.
నర్సిరెడ్డిగూడెం (Narsireddigudem) లో అధికారులు 286 మందిని నిర్వాసిత బాధితులుగా గుర్తించారు. ఇందులో 250 మందికి మాత్రమే చింతపల్లి మండలంలోని సర్వే నంబరు 253లో ఇంటి స్థలాలను కేటాయించారు. కానీ ఇప్పటివరకు ఇంటిస్థలం చూపించిన దాఖలాలు లేవు. మరో 36 మందికి అసలు పునరావాసానికి సంబంధించిన ధ్రువపత్రాలనే అందజేయలేదు.
నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ గత డిసెంబరు నెలలో పెద్దఎత్తున బాధితులు ఆందోళనకు దిగారు. నిర్మాణ పనులను సైతం అడ్డుకున్నారు. దీంతో అధికారులు స్పందించి జనవరిలో ఖచ్చితంగా బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా నేటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్లీ రెండుమూడు రోజులుగా బాధితులు ఆందోళనకు దిగారు. జేసీబీలు, ట్రిప్పర్ల సాయంతో చేపడుతున్న కట్ట నిర్మాణ పనులను బాధితులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై కేసు !


