కలం, వెబ్ డెస్క్ : స్మృతి మంధానా (Smriti Mandhana)ను ప్రియుడు పలాష్ ముచ్ఛల్ రూ.40 లక్షలకు మోసం చేశాడా? ఆ విషయంలో జరిగిన గొడవే పెళ్ళి రద్దుకు కారణమయిందా? ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ ప్రశ్నలు షేక్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నలు తలెత్తడానికి కారణం నటుడు, నిర్మాత విద్యాన్ మానే చేసిన ఆరోపణలే. పలాష్ ఆర్థిక మోసం చేశాడని విద్యాన్ ఆరోపించాడు. ఇదే అంశంపై మహారాష్ట్ర సాంగీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్మృతి మంధానా, పలాష్ పెళ్ళి రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా (Smriti Mandhana)తో పలాష్ ముచ్చల్ పెళ్ళి నవంబర్ 23న జరగాల్సి ఉంది. ఆరోగ్య కారణాలు చూపుతూ చివరి నిమిషంలో ఈ వేడుక వాయిదా పడింది. తరువాత డిసెంబర్‌లో వివాహం పూర్తిగా రద్దైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల సమయంలో చోటు చేసుకున్న ఓ అనూహ్య ఘటన కారణంగానే పెళ్లి రద్దైందని విద్యాన్ మానే ఆరోపించారు. నవంబర్ 23 2025న జరిగిన వేడుకల్లో పలాష్ ముచ్చల్ మరో మహిళతో కలిసి పట్టుబడ్డాడని చెప్పారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా నిలిచిపోయిన ఓ సినిమా ప్రాజెక్టులో మరింత పెట్టుబడి పెట్టాలని ముచ్చల్ కుటుంబం తనపై ఒత్తిడి తెచ్చిందని మానే ఆరోపించారు. సినిమా విడుదలకు బడ్జెట్ పెరిగిందని చెప్పి మరో రూ.10 లక్షలు పెట్టాలని బెదిరించారని తెలిపారు. పెట్టుబడి పెంచకపోతే తన డబ్బు తిరిగి రాదని హెచ్చరించడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. పెళ్లి రద్దైన తరువాత ముచ్చల్ కుటుంబం తనతో అన్ని విధాలా సంబంధాలు తెంచుకుందని మానే తెలిపారు.
సినిమా కోసం పనిచేసిన ఇతర కళాకారులకు కూడా వారి పారితోషికం అందలేదని వెల్లడించారు. తన ఆరోపణలకు సంబంధించిన చాట్ సంభాషణలు ఫోన్ కాల్స్ వంటి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ ఆరోపణలను పలాష్ ముచ్చల్ ఖండించారు. ఇవన్నీ అసత్య ఆరోపణలని తన ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని పేర్కొన్నారు. న్యాయవాది శ్రేయాంశ్ మిథారే ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.
Read Also: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అనిసిమోవా జోరు
Follow Us On: Sharechat


