కలం, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ (Union Budget) తయారీ కసరత్తు ముగింపు దశకు చేరుకున్నది. పార్లమెంటులో టేబుల్ చేయడానికి సమయం దగ్గరపడుతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న వరుసగా తొమ్మిదోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ హల్వా (Budget Halwa) తయారీకి ఏర్పాట్లు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో హల్వా కార్యక్రమం జరగనున్నది. ప్రతి ఏటా బడ్జెట్ తయారీ సందర్భంగా ఆ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఆర్థిక మంత్రి హల్వా విందు ఇచ్చి నోరు తీపి చేయడం రొటీన్ ప్రాక్టసీ. దేశంలో ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ. పార్లమెంటు సమీపంలోని నార్త్ బ్లాక్ సెల్లార్‌లో జరిగే హల్వా కార్యక్రమానికి దశాబ్దాల చరిత్రే ఉన్నది.
హల్వాకు, బడ్జెట్‌కు సంబంధమేంటి?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించే సందర్భంగా తయారయ్యే హల్వాకు ప్రత్యేకత ఉంది. బ్రిటీషు కాలం నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. బడ్జెట్ తయారీ కోసం సుమారు 60-70 మంది ఫైనాన్స్ డిపార్టుమెంటు ఉద్యోగులు రెండు వారాల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. బడ్జెట్ అంశాలు బైటకు లీక్ కాకుండా గోప్యంగా ఉండేందుకుగాను సిబ్బంది ఇండ్లకు వెళ్ళకుండా ఆంక్షలు అమలవుతాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై నిషేధం అమలవుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలుండవు. రెండు వారాల వీరి శ్రమను, ఎమోషన్‌ను దృష్టిలో పెట్టుకుని హల్వా విందు ద్వారా మానసికంగా వారిని సంసిద్ధం చేయాలన్న ఆలోచన కూడా ఒకటి. స్వయంగా ఆర్థిక మంత్రి, సహాయ మంత్రులు, ఆ శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొంటారు.
హల్వా తయారీతో ‘లాక్ ఇన్’ స్టార్ట్ :
హల్వాతో విందు ఇవ్వడంతోనే బడ్జెట్ ప్రింటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ‘లాక్ ఇన్’ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇంటితో, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేంతవరకూ వారు నార్త్ బ్లాక్‌లోని సెల్లార్‌లోనే ఉండిపోతారు. గతంలోని టెక్నాలజీ ప్రకారం ప్రింటింగ్ ప్రక్రియ రెండు వారాల వరకూ ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇది 2021 నుంచి నాలుగైదు రోజులకు తగ్గిపోయింది. మొదట్లో రాష్ట్రపతి భవన్‌లో ప్రింటింగ్ జరిగేది. కానీ ఒకసారి లీక్ కావడంతో మింటో రోడ్ ప్రెస్‌కు షిప్ట్ అయింది. దాదాపు పుష్కరకాలంగా అది నార్త్ బ్లాక్‌లోని సెల్లార్‌లోకి షిప్ట్ అయింది. ఆ బ్లాక్‌లో దీర్ఘకాలం కొనసాగిన ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవల కర్తవ్య భవన్‌లోకి మారినా ప్రింటింగ్ ప్రెస్ మాత్రం పాత స్థలంలోనే కొనసాగుతూ ఉన్నది.
హల్వా విందు వెనక మతలబేంటి? :
బడ్జెట్‌తో హల్వా(Budget Halwa)కు విడదీయరాని అనుబంధం ఉంది. నోరు తీపి చేయడానికి హల్వానే ఎందుకనే సందేహానికీ బలమైన కారణాలే ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ శీతాకాలంలో రూపొందుతుంది. ఈ సమయంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. హల్వాలో బాదం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. ఇవన్నీ శరీరంలో వేడి పెంచే పదార్థాలే కావడం విశేషం. బడ్జెట్ రూపొందించే సమయంలో నోరు తీపి చేసుకోవడమే కాకుండా శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత పెంచడం కూడా ఇందులోని ఒక రహస్యం. కేంద్ర మంత్రి ఈ హల్వా తినిపించిన వెంటనే ఎంపిక చేసిన ఆర్థిక శాఖ సిబ్బంది బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ పనుల్లోకి వెళ్ళిపోతారు. అత్యంత భద్రత ఉండే నార్త్ బ్లాక్ చుట్టూ బడ్జెట్ ప్రెజెంట్ చేసేంతవరకు ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా ముమ్మరంగా ఉంటుంది.
Read Also: కర్తవ్య పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
Follow Us On: Sharechat


