కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ(Republic Day)వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రాపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా కర్తవ్య పథ్ వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్‌లోని జాతీయ యోధ స్మారకానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, సైన్యాధిపతులు జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీఎస్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొత్తం 30 శకటాలు ప్రదర్శించనున్నారు.
ఇందులో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి కాగా, 13 మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రదర్శనలు స్వాతంత్య్ర కా మంత్ర వందే మాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రధాన థీమ్‌లతో జరుగనున్నాయి.ఈ థీమ్ పై ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో గాయని శ్రేయాఘషల్ ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సైనికుల పరేడ్ 90 నిమిషాల పాటు జరుగనుంది.
Read Also: సమైక్యం.. ఏకీకృతం కాదు.. గణతంత్ర సందేశంలో సీఎం సెన్సేషన్
Follow Us On: Pinterest


